‘ఆనంద్’ రాజా ఇప్పుడేం చేస్తున్నాడంటే..

Update: 2016-12-26 22:30 GMT
బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా.. ‘ఆనంద్’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు రాజా. ఆ తర్వాత అతడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ.. వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయాడు. మధ్యలో రాజకీయాల్లో వేలు పెట్టాడు కానీ.. విజయవంతం కాలేకపోయాడు. ఆపై సడెన్ గా క్రిస్టియన్ మిషనరీల వైపు ఆసక్తి చూపించాడు రాజా. తర్వాత ఏమయ్యాడో జనాలకు తెలియదు. ఐతే అతను ప్రస్తుతం ప్రభువు సేవలో మునిగిపోయి ఉన్నాడు. క్రిస్టియన్ మిషనరీల్లో పని చేస్తూ దేవుడి సేవలో పాల్గొనేవాళ్లకు ‘దైవ సహాయకులు’ అంటారు. ఇప్పుడు రాజా ఆ దైవ సహాయకుల్లో స్టార్ అట. ఇప్పుడు తన జీవితానికి పరమార్థం లభించిందని.. జీవితంలో ఇప్పుడున్నంత హ్యాపీగా ఎప్పుడూ లేనని అంటున్నాడు రాజా.

‘‘సినీ పరిశ్రమలో ఉన్నపుడు చాలానే ఎంజాయ్‌ చేశాను. విజయాలు చూశాను. డబ్బు సంపాదించాను. దేశాలు తిరిగాను. కానీ సినిమాలు శాశ్వతం కాదు. విజయాల్లో ఉన్నంత వరకే మనల్ని గుర్తుంచుకుంటారు. ఫేడవుట్ అయితే మర్చిపోతారు. కానీ దేవుడితో బంధం అలాంటిది కాదు. చీకట్లో ఉన్నా దేవుడి ప్రేమ మారదు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నా. ఇండస్ట్రీలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నా. కానీ వాటి నుంచి పారిపోవడానికి లేదు. ఎందుకంటే ఓ సినిమాకు సంబంధించి అందరూ హీరోపై ఆధారపడి ఉంటారు. సక్సెస్‌ అయితే ఎవరూ ఏమీ అనరు. కానీ ఫ్లాప్‌ వస్తేనే ఇబ్బంది. ఇతరుల ఇబ్బందులకు నేను కారణం కాకూడదనుకున్నా. అందుకే దైవ సహాయకుడిగా మారా. ఒకప్పుడు నేను క్లబ్బులు.. పబ్బుల బయట కనిపించేవాణ్ణి. ఇప్పుడు చర్చి బయట కనిపిస్తున్నా. దేవుడు నాకు చాలా స్వాతంత్య్రం.. స్వేచ్ఛ ఇచ్చాడు. చీకటిలో ఉన్న జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నవాళ్లకు.. కష్టాలతో కుంగిపోతున్న వాళ్లకు దేవుడి మార్గంలో సాయపడుతున్నా. ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించడం మంచి కార్యం. ఆ మధ్య బెంగళూరులో ఉన్న ఒకబ్బాయి ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అతడి సమస్యేంటో తెలుసుకుని నెల రోజుల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చా. ఇప్పుడతను దేవుడి మార్గంలో నడుస్తూ కౌన్సిలర్ అయ్యాడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నేను చిన్న వయసులోనే ఇలా మారానని ఏమీ అనిపించడం లేదు. ఇంకా తక్కువ వయసులోనే ఈ మార్గంలోకి రానందుకు బాధగా ఉంది’’ అని రాజా చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News