హీరోయిన్ 1993 లో.. హీరో 2019 లో!

Update: 2019-12-06 04:30 GMT
ఈమధ్య తెలుగుసినిమా కొత్త పుంతలు తొక్కుతోంది.  రొటీన్ సినిమాలు వస్తూనే ఉన్నాయి కానీ విభిన్న కాన్సెప్టులతో కూడా సినిమాలు తెరకెక్కుతున్నాయి.  మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండడంతో మేకర్స్ కూడా కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రయోగాలు చేసేందుకు వెనుకాడడం లేదు. రెండు రోజుల క్రితం 'ప్లే బ్యాక్' అనే సినిమా టీజర్ రిలీజ్ అయింది.  ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

గతంనుంచి వర్తమానానికి ఫోన్ కాల్స్ వస్తే ఏమౌతుంది.. క్రాస్ టైమ్ కనెక్షన్ అనేది సినిమా కాన్సెప్ట్.  హీరోయిన్  పాతికేళ్ళ క్రితం అంటే.. 1993 లో ఉంటుంది. హీరో 2019 వ్యక్తి.  ఆ హీరోయిన్ ఒక ల్యాండ్ లైన్ ద్వారా ఇప్పటి టిక్ టాక్ జెనరేషన్ కు చెందిన మన హీరో ఇంట్లో ఉండే మరో ల్యాండ్ లైన్ కు ఫోన్ చేస్తుంది.  మనోడు గంటల తరబడి తనతో కబుర్లు చెప్తుంటాడు. ప్రేమ లోకంలో మునిగితేలుతూ ఉంటాడు.  ఒకరోజు సడెన్ గా హీరోకు 'ఈ ఫోన్ పాతికేళ్ళ క్రితమే డెడ్ అయింది అప్పటి నుంచి పని చేయడం లేదు' అనే విషయం తెలుస్తుంది.  దీంతో అవాక్కవుతాడు.  ఆ విషయం కన్ఫాం చేసుకునేందుకు హీరోయిన్ కు ఫోన్ చేసి "తెలంగాణాకు సీఎమ్ ఎవరు?" అని మీలో ఎవరు కోటీశ్వరుడు తరహా ప్రశ్న అడుగుతాడు.  అప్పుడు హీరోయిన్ అవతలి వైపు నుంచి "తెలంగాణకు ఒకళ్లు.. ఆంధ్రాకు ఒకళ్లు.. రాయలసీమకు ఒకళ్లు ఉంటారా.. అందరికీ ఒక్కరే సీఎం. K. విజయ భాస్కర రెడ్డి" అని తాపీగా చెప్తుంది.  

ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ కింద ఉండే కామెంట్స్ చూస్తేనే ఈ సినిమా నెటిజన్లను మెప్పించిందని అర్థం అవుతోంది. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. దినేష్ తేజ్.. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు హరి ప్రసాద్ జక్కా దర్శకుడు.  కమ్రన్ సంగీతం అందిస్తున్నారు.  ప్రసాదరావు పెద్దినేని ఈ చిత్రానికి నిర్మాత.

Full View

Tags:    

Similar News