శాత‌క‌ర్ణి ప‌న్ను మిన‌హాయింపు ఎవ‌రికి?

Update: 2018-07-26 04:55 GMT
ఒక సినిమాకు ప‌న్ను మిన‌హాయింపును ప్ర‌భుత్వం ఇస్తే.. ఆ ప్ర‌యోజ‌నం ఎవ‌రికి చెందాలి?  క‌చ్ఛితంగా ప్రేక్ష‌కుడికే. ఆ విష‌యంలో మ‌రో మాటేముంది?  ప‌న్ను మిన‌హాయింపుతో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్ని స‌ద‌రు సినిమాను చూడాల‌ని చెప్ప‌ట‌మేగా?  లాజిక్కుగా చూస్తే.. ఇదే క‌రెక్ట్ అనిపించినా.. ప‌న్ను మిన‌హాయింపు పొందిన బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి మూవీ టికెట్ ను ఎప్ప‌టిలానే.. అన్ని సినిమాల మాదిరే వ‌సూలు చేయ‌టం తెలిసిందే.

మ‌రి.. అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ఎవ‌రికి వెళ్లింద‌న్న‌ది క్వ‌శ్చ‌న్. ఇదే ప్ర‌శ్న చాలామందికి వ‌చ్చినా.. పెద్ద‌గా ప‌ట్టించుకున్నోళ్లు లేరు. కొంత‌మంది ప‌ట్టించుకున్నా.. ఇప్పుడు దీనిపై ఏం ఫైట్ చేస్తామ‌న్న నిరాశ‌.. నిస్పృహ‌లో ఉండిపోయినోళ్లు ఉన్నారు. అయితే.. ఇందుకు భిన్నంగా న్యాయ‌వాది ఆద‌ర్శ్ కుమార్ 2017లో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని కోర్టులో దాఖ‌లు చేశారు.

ఈ పిల్ పై విచార‌ణ‌ను తాజాగా జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు విస్మ‌యాన్ని ప్ర‌క‌టించింది. కొన్ని సినిమాల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే వినోద‌ప‌న్ను మిన‌హాయింపు ల‌బ్థి సినిమా ప్రేక్ష‌కుల‌కు కాకుండా ఆ సినిమా నిర్మాత‌లు పొంద‌టం ఏమిట‌న్న క్వ‌శ్చ‌న్ వేసింది. ప్రేక్ష‌కుల కోసం ఇచ్చే మిన‌హాయింపును నిర్మాత తీసుకోవ‌టం ఏమిటంటూ.. ప్ర‌శ్నించింది.

అంతేకాదు.. వినోద ప‌న్ను ల‌బ్థి ప్రేక్ష‌కుల‌కు చెందాలా?  స‌ద‌రు సినిమా నిర్మాత‌ల‌కు చెందాలా? అన్న అంశంపై త‌మ‌కు క్లారిటీ ఇవ్వాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 16న చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొంది. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ తొట్ట‌తిల్ బి. రాధాకృష్ణ‌న్.. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వి. రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసు విచార‌ణ‌ను చేప‌ట్టింది.

విచార‌ణ సంద‌ర్భంగా ప‌న్ను మిన‌హాయింపు మేలు ఎవ‌రికి చెందాలో స్ప‌ష్టం చేయాల‌ని రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ పిల్ దాఖ‌లు చేసిన న్యాయ‌వాది ఆద‌ర్శ్ కుమార్ త‌న వాద‌న‌లు వినిపిస్తూ.. సినిమాల‌పై ఇచ్చే వినోద‌ప‌న్ను మిన‌హాయింపు ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌ని.. ఈ కార‌ణంగా టికెట్ ధ‌ర త‌గ్గుతుంద‌ని వాదిస్తున్నారు. శాత‌క‌ర్ణి విష‌యంలో అందుకు భిన్నంగా చోటు చేసుకుందంటూ వ్యాజ్యం దాఖ‌లు చేశారు.
Tags:    

Similar News