అల్లు వారిపై జెండా కేసు తొల‌గిపోయింది!

Update: 2017-09-01 05:28 GMT
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ కు నిన్న భారీ ఊర‌ట ల‌భించింది. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్య కుమారుడిగానే కాకుండా మెగాస్టార్ చిరంజీవికి బావ‌గా మంచి పాపులారిటీ సాధించిన అల్లు అరవింద్.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర స్థాయి నిర్మాత‌గా ఎదిగారు. చిరంజీవికి నిత్యం వెన్నుదన్నులా నిలిచే అర‌వింద్... చిరు స్థాపించిన రాజ‌కీయ పార్టీ ప్ర‌జారాజ్యంలోనూ కీల‌క భూమిక పోషించారు. ఇక చిరు స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకు వ్య‌వ‌హారాల్లోనూ అర‌వింద్‌ కు విడ‌దీయ‌రాని సంబంధ‌మే ఉంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ స‌మీపంలో ఉన్న బ్ల‌డ్ బ్యాంకు కార్యాల‌యానికి త‌ర‌చూ వెళ్లే అరవింద్ అక్క‌డ జ‌రిగే అన్ని కార్య‌క్ర‌మాల‌కూ హాజ‌ర‌వుతుంటారు.

ఈ క్ర‌మంలో ఎప్పుడో 2010లో అక్క‌డ జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆధారంగా ఆయ‌న‌పై ఓ కేసు న‌మోదైంది. హైకోర్టులో ఏడేళ్లుగా కొన‌సాగుతున్న ఈ కేసు నుంచి ఎప్పుడు విముక్తి ల‌భిస్తుందా? అని అల్లు ఫ్యామిలీ ఎదురు చూసింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో నిన్న జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా స‌ద‌రు కేసును కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో అల్లు ఫ్యామిలీకి ఊర‌ట ల‌భించింది. ఆ కేసు వివ‌రాల్లోకెళితే... 2010 ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో జ‌రిగిన వేడుక‌ల‌కు హాజ‌రైన అర‌వింద్‌... అక్క‌డ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. అయితే అల్లు అర‌వింద్ ఎగుర‌వేసిన జాతీయ జెండా తిర‌గ‌బ‌డి ఉంది. దీనిని గ‌మ‌నించిన పార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర క‌న్వీన‌ర్ ముర‌ళీ దేశ్ పాండే విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా జాతీయ జెండాను తిర‌గేసి ఎగుర‌వేసిన అర‌వింద్‌ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆయ‌న కోరారు.

అయితే జాతీయ జెండాను అర‌వింద్ ఏర్పాటు చేయ‌లేద‌ని, అయినా జాతీయ జెండాను తిర‌గేసి ఎగుర‌వేయ‌డంలో అర‌వింద్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. అయినా జాతీయ జెండాను అవ‌మాన‌ప‌రచాల‌న్న ఉద్దేశ‌మేదీ అర‌వింద్ కు లేద‌ని కూడా పేర్కొన్నారు. ఈ వాద‌న‌తో ఏకీభ‌వించిన ధ‌ర్మాస‌నం... ఉద్దేశ‌పూర్వ‌కంగా జాతీయ జెండాను అవ‌మాన‌ప‌రిస్తేనే నేర‌మ‌వుతుంద‌ని, ఈ కేసులో అలాంటి ఉద్దేశాలేమీ క‌నిపించ‌డం లేద‌ని, దీంతో ఈ కేసును కొట్టివేస్తున్న‌ట్లు పేర్కొంది. దీంతో  ఏడేళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తున్న ఈ కేసు నుంచి అల్లు అర‌వింద్ కు ఊర‌ట ల‌భించిన‌ట్లైంది.
Tags:    

Similar News