వాల్మీకి రిలీజ్ .. కోర్టు ఏం తేల్చింది?

Update: 2019-09-13 10:24 GMT
వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `వాల్మీకి` ఈనెల 20న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు- టీజ‌ర్ స‌హా ప్ర‌తిదీ ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ముఖ్యంగా వ‌రుణ్ తేజ్ లుక్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అత‌డి పెర్ఫామెన్స్ హైలైట్ గా ఉండ‌నుంద‌ని టీజ‌ర్ తో అర్థ‌మైంది. అయితే ఈ సినిమా ఈనెల 20న‌ రిలీజవుతుందా అవ్వ‌దా అన్న‌ది ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే కోర్టులు- కేసులు అంటూ గొడ‌వ‌లు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.  బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌డంతో గ‌ల్లీ నుంచి దిల్లీ వ‌ర‌కూ వాల్మీకి టైటిల్ పై పోరాటం సాగుతోంది. అనంత‌పురంకి చెందిన ఎంపీ కోర్టులో కేసులు న‌డిపించ‌డం ఇటీవ‌ల కేంద్ర స‌మాచారం ప్ర‌శార శాఖ మంత్రిని క‌ల‌వ‌డం వేడెక్కించింది. అయితే చిత్ర‌యూనిట్ మాత్రం టైటిల్ మార్పు ప్ర‌స్థావ‌న లేకుండానే.. ఈ నెల 20న సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తాజాగా కోర్టులో పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరో వరుణ్‌ తేజ్‌కు.. చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. డీజీపీకి.. సెన్సార్‌ బోర్డుకి.. ఫిలిం ఛాంబర్‌కు నోటీసులు జారీ చేయ‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వచ్చింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో యూనిట్ స‌భ్యులు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. అయితే ఈ నెల 20న రిలీజ్ అంటూ ప్ర‌క‌టించారు క‌దా?  ఇప్పుడు వాయిదా వేస్తారా?  లేక రిలీజ్ త‌ర్వాత కూడా ఈ విచార‌ణ సాగుతుందా? అని ప్ర‌శ్నిస్తే ఓ ప్ర‌ముఖ‌ నిర్మాత `కోర్టు గొడ‌వ‌లు అంతే మ‌రి` అని స‌రిపెట్టారు. కోలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `జిగర్తాండ`కు రీమేక్‌ గా తెరకెక్కిన `వాల్మీకి` టైటిల్ మార్పున‌కు సంబంధించిన గొడ‌వ ప్ర‌స్తుతం స‌ర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు.


Tags:    

Similar News