చుక్క‌ల్లో భామ‌ల పారితోషికాలు.. అయినా కానీ!

Update: 2021-07-13 11:30 GMT
రంగుల ప్ర‌పంచంలో క‌థానాయిక‌ల లైఫ్ స్పాన్ చాలా చిన్న‌ది. హీరోయిన్లకు వృత్తిప‌ర‌మైన రిటైర్మెంట్ చాలా తొంద‌ర‌గా వస్తుంది. అందుకే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న చందంగా రైజింగులో ఉన్నంత కాలం ప్ర‌తిదీ చ‌క్క‌బెట్టేస్తుంటారు. ప్ర‌స్తుత త‌రం నాయిక‌ల‌ లైఫ్ స్పాన్ మ‌రింత‌గా త‌గ్గింది. 35 ఏజ్ కే రిటైర్ మెంట్. ఆ త‌ర్వాత ఏ బిజినెస్ మేన్ నో పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిర‌ప‌డుతున్న వారే ఎక్కువ‌.

అయితే కొంత మంది భామ‌ల్ని మాత్రం ఈ లిస్ట్ నుంచి మిన‌హా యించాల్సిందే. న‌య‌న‌తార‌-కాజ‌ల్- అనుష్క‌- స‌మంత‌- త‌మ‌న్నా  ఈ కేట‌గిరీలో లేరు. అందాల చంద‌మామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ కెరీర్ ఇక ముగియ‌నుందని నాలుగేళ్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నా...ఆమె ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో భాష‌లో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ లోనే ఉన్నారు. రెండ‌వ సారి మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టిస్తోంది. ఆచార్య లో నాయిక‌గా న‌టిస్తూ ఇంకా క్రేజు ఏమాత్రం త‌గ్గ‌లేదని నిరూపిస్తోంది.

కాజ‌ల్ ఒక్కో సినిమాకు 2.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారుట‌.

ఇక స్వీటీ అనుష్క స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.రిటైర్మెంట్ అనే ఆలోచ‌న అనుష్క శెట్టికి లేదు.  ఓవైపు లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తూనే...మ‌రోవైపు హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. అనుష్క కూడా కాజ‌ల్ త‌ర‌హాలో 2.5 కోట్లు పారితోషికం తీసుకుంఉన్నారుట‌. గ‌త కొంత‌కాలంగా సినిమాల ప‌రంగా స్పీడ్ త‌గ్గించడానికి ర‌క‌ర‌కాల వ్య‌క్తిగ‌త కార‌ణాలు ఉన్నాయి.

ఇక ముంబై బ్యూటీ పూజా హెగ్దే కెరీర్ ఆరంభంలో స‌రైన విజ‌యాలు లేక‌పోయినా ఇప్పుడు టాలీవుడ్ ని ఏల్తోంద‌నే అనాలి. వ‌రుస విజ‌యాలు పూజా హెగ్దే ని అగ్ర నాయిక‌గా నిల‌బెట్టాయి. అల వైకుంఠ‌పుర‌ములో లాంటి ఇండ‌స్ట్రీ హిట్ లో న‌టించాక త‌న రేంజు అమాంతం పెరిగింది. బుట్ట బొమ్మ‌గా పాపుల‌ర‌య్యాక‌ ఇప్పుడు ఒక్కో సినిమాకు 3.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారుట‌. పూజా హెగ్దేని మిన‌హాయిస్తే కాజ‌ల్- అనుష్క ప్రోఫెష‌న‌ల్ కెరీర్ లు 15 ఏళ్ల‌కు పైగానే కొన‌సాగాయి. ప్ర‌స్తుతం ఈ భామ‌లు సీనియ‌ర్ హీరోలకు యాప్ట్ అనే భావ‌న నెల‌కొంది.

మ‌రోవైపు ఇత‌ర భామ‌లెవ‌రూ ట‌చ్ చేయ‌లేని రీతిలో అందాల న‌య‌న‌తార లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ ఒక్కో క‌మిట్ మెంట్ కి 3-5 కోట్ల పారితోషికం అందుకోవ‌డం ఇంత‌కుముందు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కోటి వ‌ర‌కూ పారితోషికం అందుకుంటున్నారు.

ఇటీవ‌లే వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్పీడ్ మీదున్న స‌మంత వెబ్ సిరీస్ ల‌తోనూ స‌త్తా చాటుతున్నారు. అక్కినేని కోడ‌లు ఓబేబి-మ‌జిలీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌ర్వాత పారితోషికం అమాంతం పెంచార‌ని 2.5 కోట్లు పైగా అందుకుంటున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక ఇటీవ‌ల ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో మ‌రింత‌గా పారితోషికం పెంచేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ భామ‌లంద‌రికీ ధీటుగా సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ రోజుకు 10ల‌క్ష‌ల పారితోషికం అందుకోవ‌డం ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News