డిజాస్టర్ మూవీకి రికార్డు వ్యూస్

Update: 2018-06-26 01:30 GMT
దక్షిణాది సినిమాల డబ్బింగ్ వెర్షన్లకు గత కొన్నేళ్లలో ఉత్తరాదిన బాగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఎలాంటి ఫలితాన్నందుకున్నాయన్న దాంతో సంబంధం లేకుండా మంచి రేటు ఇచ్చి డబ్బింగ్ చేసి యూట్యూబ్‌ లో.. టీవీ ఛానెళ్లలో వేసుకుని రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటున్నారు అక్కడి సెకండ్ గ్రేడ్ ప్రొడ్యూసర్లు. వీటికి అక్కడ వస్తున్న స్పందన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మన దగ్గర పెద్ద డిజాస్టర్ అయిన ప్రభాస్ సినిమా ‘రెబల్’కు యూట్యూబ్ లో కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. అల్లు అర్జున్ సినిమాలకైతే అక్కడ మామూలుగా లేదు క్రేజ్. ‘సరైనోడు’ సినిమా ఇండియా మొత్తంలో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా యూట్యూబ్ లో రికార్డు సృష్టించడం విశేషం. దానికి 18.5 కోట్ల దాకా వ్యూస్ రావడం నమ్మశక్యం కాని విషయం. దాని తర్వాత వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా భారీగా వ్యూస్ సంపాదిస్తోంది.

ఐతే ఇప్పుడు మరో దక్షిణాది సినిమా యూట్యూబ్ రికార్డుల అంతు చూడ్డానికి బయల్దేరింది. అదే.. వివేగం. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం గత ఏడాది తమిళ.. తెలుగు భాషల్లో విడుదలై డిజాస్టర్ అయింది. దీనికి ఓపెనింగ్ప్ బాగా వచ్చినప్పటికీ.. వీకెండ్ తర్వాత నిలవలేకపోయింది. బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. ఐతే ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్‌ ను షేక్ చేస్తోంది. హిందీలో అనువాదం చేసి యూట్యూబ్ లో వదిలితే.. వారం తిరక్కుండానే 2.6 కోట్ల మంది ఈ సినిమాను చూశారు. వారంలో ఇన్ని వ్యూస్ ఏ సినిమాకూ రాలేదు. నెల తిరిగేసరికి ఇది ఈజీగా పది కోట్ల వ్యూస్ మార్కును దాటుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ‘సరైనోడు’ రికార్డును కూడా బద్దలు కొట్టేసే అవకాశాలు లేకపోలేదు. ‘సరైనోడు’ 10 కోట్ల మార్కును అందుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. బాలీవుడ్లో మాస్ మసాలా సినిమాలు తగ్గిపోతుండటంతో దక్షిణాదిన వస్తున్న మాస్ సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు ఇలా యూట్యూబ్.. టీవీ ఛానెళ్లలో బ్రహ్మరథం పడుతున్నారు. కొన్ని హిందీ ఛానెళ్లు కేవలం దక్షిణాది డబ్బింగ్ సినిమాలతోనే నడుస్తుండటం విశేషం.
Tags:    

Similar News