'ఆకాశం నీ హ‌ద్దురా' హిందీ రీమేక్ షురూ..!

Update: 2022-04-25 10:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర తెరకెక్కించిన చిత్రం ''సూరరై పొట్రు''. క‌రోనా పాండమిక్ నేపథ్యంలో 2020 లో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేశారు. తెలుగులో ''ఆకాశం నీ హ‌ద్దురా'' అనే పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు.  

'ఆకాశం నీ హ‌ద్దురా' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. సూర్య అద్భుత నటనతో అందరినీ మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా ఎన్నో అవార్డులు సాధించడమే కాదు.. పలు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు ఎంపిక కాబడింది. స్ట్రీమింగ్ కాబడి నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇప్పుడు ''ఆకాశం నీ హ‌ద్దురా'' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ - రాధిక మదన్ ప్రధాన పాత్రల్లో ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గతేడాది అధికారికంగా ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ ను ఈరోజు సోమవారం సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాని ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ముందు హీరోయిన్ రాధికా మ‌ద‌న్ కొబ్బరికాయ కొడుతున్న ఓ వీడియోను అక్ష‌య్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. కొత్త సినిమా షూటింగ్ ను మొద‌లుపెట్టామ‌ని.. దీనికి మంచి టైటిల్‌ ను సూచించ‌మ‌ని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశారు.

'సూరరై పొట్రు' చిత్రాన్ని సిఖ్య ఎంట‌ర్‌టైన్మెంట్స్ మరియు 2D ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై సూర్య నిర్మించారు. ఇప్పుడు హిందీ రీమేక్ తో సూర్య - జ్యోతిక కలిసి నిర్మాతలుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.  బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రా కు చెందిన అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ మరియు అక్షయ్ కుమార్ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారు.

హిందీ ప్రాజెక్ట్ గురించి సూర్య ట్వీట్ చేస్తూ.. ఈ కొత్త ప్ర‌యాణానికి  అంద‌రి అశీర్వాదం కావాలంటూ అక్ష‌య్‌ కుమార్‌ తో క‌లిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సామాన్యులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాలానే లక్ష్యంతో.. ఒక సాధారణ పైలట్ విమానయాన సంస్థను ఎలా నెలకొల్పారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఓటీటీలో ఆదరణ పొందుతోన్న ఈ సినిమాను నార్త్ ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
Tags:    

Similar News