#గుస‌గుస‌.. పాన్ ఇండియా స్టార్ల‌పై ఏలియ‌న్ ట్రాప్!?

Update: 2022-07-20 03:30 GMT
ప్రపంచీక‌రణ ప్ర‌తిదీ మార్చేసింది. ప్ర‌పంచ దేశాల్లో ఉత్ప‌త్తిని ఎక్క‌డ అయినా అమ్ముకోవ‌చ్చు. ప్ర‌తిభ‌ను ఎక్క‌డైనా ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చు. అవ‌కాశాలు అందుకోవచ్చు. ఇది గ్లోబ‌ల్ మార్కెట్. ఆర్జించ‌డం ఒక్క‌టే ఇక్క‌డ ముఖ్యం. ఇండియ‌న్ సినిమా స్టార్లు ఫిలిం మేక‌ర్లు ఇప్పుడు దీనిని అనుస‌రిస్తున్నారు. పాన్ ఇండియా లేదా పాన్ వ‌ర‌ల్డ్ అంటూ అసాధార‌ణ బ‌డ్జెట్ల‌తో మ‌న మేక‌ర్స్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం  ట్రెండ్ గా మారింది. దీనివ‌ల్ల తెలుగు స్టార్లు దేశవిదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. బాహుబ‌లి ఫ్రాంఛైజీతో  ప్ర‌భాస్.. ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చ‌ర‌ణ్- ఎన్టీఆర్ పాన్ ఇండియా (వ‌రల్డ్) స్టార్లుగా త‌మ‌ను తాము ఆవిష్క‌రించుకున్నారు.

అదే క్ర‌మంలో హాలీవుడ్ నుంచి మ‌న స్టార్ల‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌న్న టాక్ ఉంది. అమెరిక‌న్ నిర్మాత‌ల నుంచి ఇప్ప‌టికే  ప్ర‌భాస్..చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌కు పిలుపు అందింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే హాలీవుడ్ నుంచి వ‌చ్చేవి వీళ్ల‌కు అన్నివిధాలా క‌లిసొస్తాయా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. కొన్ని అవ‌కాశాలు గొప్ప‌వి కావ‌చ్చు. మ‌రికొన్ని కేవ‌లం గాలం (ట్రాప్) వేయ‌డంగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మ‌న స్టార్ల ముఖాల‌ను ఉపయోగించుకుని భార‌తీయ మార్కెట్లో ఓపెనింగుల‌ను ఆర్జించే యోచ‌న ఇద‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. అందుకే  త‌మ‌కు ఆఫ‌ర్ చేసిన‌ది ఎలాంటిదో చెక్ చేసుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు.

అందుకు ధ‌నుష్ హాలీవుడ్ ఎంట్రీ మూవీని ఉద‌హ‌రిస్తున్నారు. ఇటీవల త‌మిళ స్టార్ హీరో ధనుష్ రస్సో బ్రదర్స్ `ది గ్రే మ్యాన్`తో హాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ ట్రైల‌ర్ లో ధ‌నుష్ క్ష‌ణ‌కాలం మాత్ర‌మే క‌నిపించాడు. అత‌డికి స్క్రీన్ సమయం లేదని ప్రీమియ‌ర్ల నుంచి టాక్ వెలువ‌డింది. అవెంజ‌ర్స్ మేక‌ర్స్ అవ‌కాశం అంటూ ప్ర‌చారం సాగినా అంత‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర వ‌ల్ల ఉప‌యోగం లేదు. కేవ‌లం వీకీలో హాలీవుడ్ మూవీ అని రాయ‌డానికి త‌ప్ప‌. ప్రాముఖ్య‌త లేని అతిథి పాత్ర‌ల‌కు అంగీక‌రించే కంటే వ‌దులుకోవ‌డ‌మే మేలు అని కూడా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. స్టార్ డ‌మ్ ని చంపే వాటిని వ‌దులుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఇంత‌కుముందు దీపిక ప‌దుకొనే..  ప్రియాంక చోప్రా-శృతిహాస‌న్ లు హాలీవుడ్ లో న‌టించినా అంత‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర‌ల్లో క‌నిపించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అలా కాకుండా  ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లు పోషించే అవ‌కాశాల‌ను వెతికితే బావుండేది అన్న సూచ‌న‌లు వినిపించాయి. అయితే ఇవ‌న్నీ మ‌న స్టార్ల‌కు పాఠాలు కాగ‌ల‌వు. చ‌ర‌ణ్‌-తార‌క్-ప్ర‌భాస్- మ‌హేష్ ల‌కు మునుముందు హాలీవుడ్ ఆఫ‌ర్లు రావ‌డం ఖాయం. కానీ వాటిని వారు తెలివిగా ఎంపిక చేయాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

హాలీవుడ్ లో ఎలాంటివి వెత‌కాలి?

ప్ర‌స్తుతం హాలీవుడ్ లో సూప‌ర్ హీరో సినిమాల హ‌వా సాగుతోంది. లార్జ‌ర్ దేన్ లైఫ్  క్యారెక్ట‌ర్ల‌తో బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సునాయాసంగా కొల్ల‌గొడుతున్నారు. యూనివ‌ర్శ్ లు మ‌ల్టీవ‌ర్స్ లు పేరుతో భారీ విజువ‌ల్ ట్రీట్ ని అందిస్తున్నారు. అయితే మ‌న స్టార్ల ప్ర‌తిభ అలాంటి భారీ చిత్రాల‌కు స‌రిపోదా? అంటే అవ‌కాశం వ‌స్తే నిరూపించే స‌త్తా ఉంద‌ని బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాతో ప్రూవ్ అయ్యింది. బ‌డ్జెట్లు పెట్టాలే కానీ మ‌న స్టార్లు కూడా హాలీవుడ్ రేంజు సినిమాల‌తో నిరూపిస్తార‌ని కూడా ప్ర‌ముఖులంతా విశ్లేషిస్తున్నారు.

అందుకే హాలీవుడ్ క‌నెక్ష‌న్స్ ని వ‌ర్క‌వుట్ చేస్తూ ఓ మోస్త‌రు పెద్ద అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు. హాలీవుడ్ లో పీఆర్ ఏజెన్సీల‌తో సంబంధాలు కూడా పెద్ద ఆఫ‌ర్లు తెస్తాయ‌ని కూడా విశ్లేషిస్తున్నారు. వెతికే తీగ కాలికి త‌గిలేవ‌ర‌కే.. ఆ త‌ర్వాత ఎలాంటి మ‌లుపులు అయినా సాధ్యం. దీనికోసం ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన కృషి అవ‌స‌రం. ఆర్.ఆర్.ఆర్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న స్టార్ల గురించి చ‌ర్చ సాగుతోంది. ఇక‌పై ఇది మ‌రింత ఉధృతం అయితే.. మ‌రిన్ని పాన్ వ‌ర‌ల్డ్ సినిమాల‌తో టాలీవుడ్ దూసుకెళితే మ‌న‌ స్టార్ల‌ను హాలీవుడ్ పెద్ద‌ అవ‌కాశాలు వాటంత‌ట అవే వ‌రిస్తాయ‌ని కూడా విశ్లేషిస్తున్నారు. దీనికోసం ఇంకొన్ని సంవ‌త్స‌రాలు వేచి చూడాల్సి ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News