'రిపబ్లిక్' ఎలా ఉండబోతోంది..?

Update: 2021-07-02 07:32 GMT
'వెన్నెల' 'ప్రస్థానం' 'ఆటోనగర్‌ సూర్య' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ తో కలిసి ''రిపబ్లిక్'' అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ లను బట్టి చూస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది.

దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా అధికారులు ఎలా ఉండాలి అనేది ''రిపబ్లిక్'' చిత్రంలో చూపించనున్నారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు మరియు బాధ్యతారహిత పౌరులే లక్ష్యంగా సందేశాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. పాలకుల కింద ప్రభుత్వోద్యోగులు ఎలా నలిగిపోతున్నారు అనేది ప్రస్తావిస్తున్నారట.

ఇందులో సంభాషణలు దేవా కట్టా శైలిలో రాజకీయ నాయకులను ప్రశ్నించే విధంగా అందరినీ ఆలోచిపజేసేలా ఉంటాయట. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టే ఈ చిత్రం కాంట్రవర్సీ అంశాలను కూడా లేవదీయనుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే సెన్సార్ బోర్డ్ ఎలాంటి కత్తెరలు వేయకుండా 'రిపబ్లిక్' చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేస్తుందేమో చూడాలి.

ఇకపోతే అవినీతిమయమైన వ్యవస్థ పునాదులను సరిచేయాలని చూసే ఐఏఎస్ అధికారి పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నారు. తప్పు ఒప్పుల గురించి ఆలోచించకుండా అధికారం మాత్రమే శాశ్వతం అనుకునే రాజకీయ నాయకురాలు పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు 'రిపబ్లిక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు.
Tags:    

Similar News