అయినా మహేష్ తగ్గట్లేదే..

Update: 2017-11-18 07:02 GMT
‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’ లాంటి డిజాస్టర్ల తర్వాత వచ్చిన మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’. ఐతే ఆ రెండు ఫెయిల్యూర్ల ప్రభావం ‘శ్రీమంతుడు’ మీద ఎంత మాత్రం పడలేదు. ఆ సినిమాకు మహేష్ కెరీర్లోనే అత్యధిక స్థాయిలో బిజినెస్ జరిగింది. విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పుడు ‘భరత్ అను నేను’ విషయంలోనూ ఇదే సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీనికి ముందు వచ్చిన మహేష్ సినిమాలు ‘బ్రహ్మోత్సవం’.. ‘స్పైడర్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. కానీ ఆ ఎఫెక్ట్ ‘భరత్ అను నేను’ మీద పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి కనిపిస్తున్నట్లు సమాచారం. నిర్మాత కూడా సినిమా హక్కుల విషయంలో కొండెక్కి కూర్చున్నాడట.

‘భరత్ అను నేను’కు ప్రతి ఏరియాలోనూ బిజినెస్ పరంగా నాన్-బాహుబలి రికార్డు రేట్లు చెబుతున్నారట. వైజాగ్ ఏరియా హక్కులు మాత్రమే రూ.11 కోట్లు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ఏరియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మహేష్ గత సినిమాల ఫలితాల గురించి పట్టించుకోకుండా బయ్యర్ల నుంచి హక్కుల కోసం మంచి పోటీ నెలకొనడంతో నిర్మాత రేట్ల విషయంలో తగ్గేదే లేదంటున్నట్లు సమాచారం. మరోవైపు శాటిలైట్ హక్కుల కోసం కూడా మూడు ప్రధాన ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల నుంచి గట్టి పోటీ నెలకొందట. మహేష్-కొరటాల కలిసి తొలి సినిమా చేసినపుడే దానికంత బజ్ ఉన్నపుడు.. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇప్పుడు వీరి వెనుక ఉంది. దీంతో ‘భరత్ అను నేను’పై ఫుల్ పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News