డబ్బింగ్ కోసం వింత డిమాండ్లు

Update: 2018-12-30 06:49 GMT
ఇప్పుడు సినిమా వ్యాపారం అనేది కేవలం థియేట్రికల్ రైట్స్ కు మాత్రమే సంబంధించినది కాదు. హక్కుల రూపంలో నిర్మాతలకు ఆదాయ మార్గాలు పెరిగాయి. శాటిలైట్ మొదలుకుని డబ్బింగ్ డిజిటల్ అంటూ రకరకాల వనరులు అందుబాటులోకి వచ్చాయి. అందుకే నిర్మాణ సమయంలోనే ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్న సౌత్ సినిమా హిందీ డబ్బింగులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే వీటికి ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం మన సినిమాల్లో వుండే మాస్ మసాలాలే. ఇక్కడ డిజాస్టర్ అనిపించుకున్న మాస్ సినిమాలు గోల్డ్ మైన్స్ అనే యుట్యూబ్ ఛానల్ లో నమోదు చేస్తున్న ఫిగర్స్ చూస్తే షాక్ తినాల్సిందే. నితిన్ లై ఇప్పటిదాకా 80 మిలియన్ల వ్యూస్ దాటేసిందంటే నమ్మడం కష్టమే అయితే ఇది నిజం.

అందుకే హక్కులు కొనే సమయంలోనే ఆ సినిమాల్లో ఫైట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని కొంటున్నారట. కళ్యాణ్ రామ్ నా నువ్వే కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ కోసమే రెండు అదనపు ఫైట్లు జోడించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సదరు ఛానల్స్ కన్ను మన సంక్రాంతి సినిమాల మీద పడింది. ఏకంగా హైదరాబాద్ లోనే మకాం వేసి నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు మహనాయకుడు రెండు భాగాల హక్కుల కోసం చర్చలు జరిగాయట.

అయితే వీటిలో పోరాట సన్నివేశాలు ఉంటే కనక చెప్పిన రేట్ కు ఇచ్చేందుకు రెడీ అని చెప్పారట. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి మసాలా అంశాలు ఇరికించే అవకాశం లేదు. అందులోనూ మహానాయకుడులో ఒక్క శాతం ఛాన్స్ కూడా లేదు. క్రిష్ బాలకృష్ణ ఈ ప్రతిపాదన తిరస్కరించారట. ఉన్నది ఉన్నట్టు కొంటే తప్ప హక్కులు ఇవ్వలేమని తేల్చి చెప్పారట. మరో రెండు మూడు రోజుల్లో డీల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది
    

Tags:    

Similar News