మ్యాన్షన్ హౌస్.. భలే పేలిందే!

Update: 2019-05-14 14:30 GMT
మన సినిమాల్లో తాగుడు సీన్లు కొత్తగా వచ్చినవి కాదు.  ఎప్పటినుంచో ఉన్నవే.  హీరోలు.. కమెడియన్ పాత్రలు తాగిన మత్తులో చేసే విచిత్రాలతో చాలామంది డైరెక్టర్లు కామెడీ పండిస్తారు. ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఎంఎస్ నారాయణ తాగుబోతు పాత్రలో కనిపిస్తే ఇక ఎవరైనా పడిపడి నవ్వాల్సిందే. ఈ జెనరేషన్ లో తాగుబోతు రమేష్ లాంటి కమెడియన్స్ ఎంఎస్ నారాయణగారి లిక్కర్ లెగసీని 'ఆ విధంగా' ముందుకు తీసుకుపోతున్నారు.. టాలీవుడ్ సంప్రదాయాల్ని కాపాడుతున్నారు.   ఇప్పుడు ఇంత ఇంట్రో ఎందుకు వచ్చిందంటే.. అది అల్లు శిరీష్ 'ఎబీసిడీ' ట్రైలర్ పుణ్యమే.

ట్రైలర్ అంతా ఒక ఎత్తైతే.. చివర్లో వచ్చిన "దిస్ ఈజ్ మ్యాన్షన్ హౌస్.. పూర్ పీపుల్స్ రిచ్ డ్రింక్.. రిచ్ పీపుల్స్ ఫేవరెట్ డ్రింక్" మరో ఎత్తు. ఈ డైలాగ్ వెంటనే ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. దాదాపుగా తాగుబోతులందరికీ ఈ డైలాగ్ ఫుల్ మీనింగ్ తెలిసే ఉంటుంది. తాగుబోతులకు తోడునీడగా ఉంటూ.. తామరాకు మీద నీటిబొట్టులా కూల్ డ్రింక్స్ తాగుతూ.. స్నాక్స్ లాగిస్తూ ఉండే మానవతావాదులకు కూడా ఇది తెలిసే ఉంటుంది. అయితే లిక్కర్ బ్యాచ్ కానివాళ్ళకు మాత్రం తెలిసే అవకాశం తక్కువే.  

మద్యంలో బీర్ అని.. విస్కీ అని.. బ్రాంది అని.. రమ్ అని.. వోడ్కా అని.. జిన్ అని.. వైన్ అని ఎన్నోరకాలు ఉన్నాయి. వాటిలో ప్రతి కేటగిరీలో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి.  వాటిలో కాస్ట్లీ నుంచి చీపు వరకూ ధరల్లో తేడాలున్నాయి.  బాబులూ.. ఇదేదో లిక్కర్ క్లాసని ఖంగారు పడకండి.. డైరెక్ట్ గా పాయింట్ లోకే వెళ్తున్నాం.  ఈ మ్యాన్షన్ హౌస్ ఒక బ్రాంది బ్రాండు. అతి సాధారణమైన సరసమైన ధర.  పేదలకు అందుబాటులో ఉండే ధర.  అయితే ఇదే బ్రాండును మిలియనీర్స్ కూడా వాడతారు.

కారణం ఏంటంటే.. మిగతా బ్రాండ్లు తాగి తాగి ఒళ్ళు హూనం అయిన తర్వాత ఓ శుభ తరుణంలో డాక్టర్ సలహా ఇస్తాడు. "మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. వెంటనే మానేయండి. లేకపోతే పైకి తత్కాల్ బుకింగ్ కన్ఫామ్ అవుతుంది" అంటాడు. అయితే "డాక్టర్ గారూ.. సాయంత్రం అయితే చాలు..  నాలిక జివ్వని లాగుతుందండీ. ఏదైనా మధ్యే మార్గం సూచించండి" అని దీనంగా వేడుకుంటే అప్పుడు తప్పదు అన్నట్టుగా మంచి సలహా కాకపోయినా  డాక్టర్ గారు "బ్రాందీ మాత్రం తాగవచ్చు అది కూడా తగిన మోతాదు లోనే" అంటాడు.  అప్పుడు ఈ రిచ్చి పీపుల్ మ్యాన్షన్ హౌస్ కు షిఫ్ట్ అవుతారు. మిగతావి ఏది తాగినా త్వరగా పోతారు కాబట్టి ఇది వారికి అమృతంతో సమానం.. అందుకే ఇది కాస్ట్లీ బ్రాండ్ కాకపోయినా రిచ్ జనాలలో సగం మందికి ఫేవరేట్ డ్రింక్ గా మారిపోయింది. ఎబీసిడీ ఎండింగ్ డైలాగ్ వెనక ఇంత కథ ఉంది.  ఆ రచయిత ఎవరో గానీ ఆయనకు ఓ ఛీర్స్..!
    

Tags:    

Similar News