మాస్ మహారాజ్ కోసం రూ. 5 కోట్లతో భారీ సెట్..!

Update: 2022-08-29 11:30 GMT
మాస్ మహారాజా రవితేజ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''రావణాసుర'. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందించబడుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది.

'రావణాసుర' సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ కోసం మేకర్స్ 5 కోట్ల రూపాయలతో ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ DRK కిరణ్ పర్యవేక్షణలో ఈ సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం అక్కడే క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. విభిన్నమైన ఈ యాక్షన్ బ్లాక్‌ ని స్టన్ శివ ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేసారని టాక్. ఇది సినీ అభిమానులకు మరియు యాక్షన్ ప్రేమికులకు ఫీస్ట్ గా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే 'రావ‌ణాసుర' సినిమా నుంచి విడుదలైన రవితేజ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ ఒక లాయర్‌ గా యాక్షన్‌ తో కూడిన పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో అతనితో సుశాంత్ స్క్రీన్ స్పేస్ పంచుకోవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అను ఇమ్మాన్యుయేల్ - మేఘా ఆకాష్ - ఫరియా అబ్దుల్లా - దక్షా నగర్కర్ - పూజిత పొన్నాడ వంటి ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే & డైలాగ్స్ అందిస్తున్నారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌ తో ఆసక్తికరమైన కథనంలో కొన్ని ఊహించని ట్విస్టులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించడానికి దర్శకుడు కృషి చేస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రావు రమేష్ - మురళీ శర్మ - సంపత్ రాజ్ - నితిన్ మెహతా ('అఖండ' ఫేమ్) - సత్య - జయ ప్రకాష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయి.

ఇటీవల కాలంలో 'ఖిలాడి' & 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి బ్యాక్ టూ బ్యాక్ రెండు భారీ ప్లాప్స్ అందుకున్న రవితేజ.. ఈసారి ''రావ‌ణాసుర'' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని మాస్ మహరాజ్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News