ఇప్పటివరకు ఏ ఆత్మీయుడి సంతాప సభకు వెళ్లలేదు.. ఇదే తొలిసారి!

Update: 2022-09-14 04:34 GMT
తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన నట 'కన్నప్ప' సంతాప సభను నిర్వహించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సంతాప సభలో మాట్లాడిన వక్తల్లో పలువురు తమ నోటితో కాకుండా మనసుతో మాట్లాడినట్లుగా మాట్లాడారు.సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

తన జీవితంలో ఇప్పటివరకు ఎంతటి ఆత్మీయుడి మరణించినా కూడా.. వారి సంతాప సభలకు వెళ్లలేదని.. మొదటిసారి సంతాప సభకు వచ్చినట్లు పేర్కొన్నారు. తనను నోరారా ఒరేయ్ అని పిలిచే నటుడు కృష్ణంరాజు అని గుర్తు చేసుకున్నారు. తనను తొలిసారి బెంజ్ కారు ఎక్కించింది కూడా ఆయనే అన్న మోహన్ బాబు.. నటుడిగా ఎన్నో విషయాల్ని కృష్ణంరాజు నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు.

గొప్ప నటుడు.. నిర్మాతను చిత్రపరిశ్రమ కోల్పోయిందని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్న మోహన్ బాబు.. తమ ఇంట్లో కూర్చొని మనసు కవి ఆత్రేయ రాసిన మాటల్ని గుర్తు చేసుకుంటూ.. "మృత్యువు అంటే నాకెందుకు భయం. నేనున్నప్పుడు అది రాదు. అది వచ్చినప్పుడు నేను ఉండను" అని అన్నారు.

ఇదే సభలో మోహన్ బాబు కుమారుడు.. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. తనకు  కృష్ణంరాజు  ఫోన్ చేసి.. మా ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారన్నారు. వాడు సినిమాలు చేసుకుంటున్నాడు.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని నాన్న చెబితే వినిపించుకోలేదంటూ ఇప్పటివరకు బయటకు రాని విషయాన్ని చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News