న‌న్ను న‌ల్ల పిల్లి అని పిలిచేవారు!-ప్రియాంక చోప్రా

Update: 2022-12-08 03:13 GMT
బాడీ షేమింగ్ నేటి ఆధునిక స‌మాజంలో శోచ‌నీయం. కానీ రంగు పొంగు గురించి మ‌నుషుల‌ కామెంట్లు రెగ్యుల‌ర్ గా వింటూనే ఉంటాం. అమీర్ ఖాన్ కుమార్తె నుంచి షారూక్ ఖాన్ కుమార్తె వ‌ర‌కూ.. అంతెందుకు సాక్షాత్తూ ప్ర‌పంచ సుంద‌రి విశ్వ‌సుంద‌రి అంటూ గొప్ప‌ ప్ర‌తిభ అంద‌చందాల‌తో కిరీటాలు గెలుచుకున్న మాజీ మిస్సులు ప్రియాంక చోప్రా... సుస్మితాసేన్ ల‌కే ఇలాంటి కామెంట్లు ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు.

ఆ ఇద్ద‌రు సుంద‌రీమ‌ణులు పురుషాధిక్య ప్ర‌పంచాన్ని స‌వాల్ చేస్తూ కెరీర్ ప‌రంగా ఎదిగిన గొప్ప న‌టీమ‌ణులు. వ్య‌క్తిత్వంలో శిఖ‌రం ఎత్తు. నిజానికి నిర్భయ వైఖరితో 'మీ-టూ' వేదిక‌గా బ‌ల‌మైన గొంతు వినిపించిన గ్లోబ‌ల్ ఐకాన్ గా ప్రియాంక చోప్రా చాలా మందికి స్ఫూర్తి. పీసీ తరచుగా పురుషాహంకారం- జాత్యాహంకారం- బాడీ షేమింగ్ వంటి సమస్యల గురించి బ‌హిరంగంగా మాట్లాడుతుంది. ఇటీవల ఒక అంతర్జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీ తన రంగు (ఛాయ) కార‌ణంగా ముంబై ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ కి గుర‌య్యాన‌ని నాటి సంగ‌తుల‌ను గుర్తుచేసుకుంది. ఆ మాట‌కొస్తే అందరూ గోధుమ వ‌ర్ణం లేదా న‌లుపు రంగును క‌లిగి ఉండే ఈ ప‌విత్ర భార‌త‌ దేశంలో న‌న్ను 'నల్ల పిల్లి'....'డస్కీ' అని కూడా పిలుస్తారు. నేను స‌హ‌న‌టీమ‌నుల‌ కంటే ఎక్కువ ప్రతిభావంతురాలిని అని ప్ర‌జ‌లు న‌మ్మినా కానీ.. ప్రత్యర్ధుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని నా శ‌రీర ఛాయ అందంగా లేనందున ఇబ్బందుల‌కు గుర‌య్యాన‌ని పీసీ చెప్పారు.

ఈ ఏడాది బీబీసీ '100 మంది మహిళల' జాబితాలో చోటు దక్కించుకున్న నలుగురు భారతీయుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. ఈ సంద‌ర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఈ సంగ‌తుల‌న్నీ ముచ్చ‌టించారు.
బంగారు రంగులో త‌ళ‌త‌ళా మెరిపించే మెరుపులేవీ త‌న‌కు లేవని పీసీ అంగీక‌రించింది. బాలీవుడ్ లో తన తొలినాళ్లలో హీరోల‌కు సమానమైన వేతనం ఎప్పుడూ పొందలేదని సినిమా సెట్స్ లో పురుషులు ప్రత్యేక అధికారాలను ఎలా ఆస్వాధించేవారో కూడా వెల్ల‌డించింది.

బాలీవుడ్ లో నాకు ఎప్పుడూ మేల్ స్టార్ల‌కు సమానంగా వేతనం ఇవ్వ‌లేదు. నా సహ నటుడి పారితోషికంలో నాకు 10శాతం చెల్లిస్తే అదే గొప్ప‌. భ‌త్యాల చెల్లింపు వ్యత్యాసం చాలా భారీగా ఉండేది. ఇంకా చాలా మంది న‌టీమ‌ణులు అథ‌మ స్థానంలోనే ఉన్నారు. ప్ర‌తిదీ ఎదుర్కొంటూనే ఉన్నారు. నేను ఇప్పుడు బాలీవుడ్ లో మేల్ కో-స్టార్ తో కలిసి పని చేస్తే నా ప‌రిస్థితి కూడా అదే అని ఆమె చెప్పింది. నా తరం న‌టీమ‌ణులు క‌చ్చితంగా సమాన వేతనం కోసం ప్ర‌శ్నించేవారు.. కానీ అది ఎవ‌రికీ అంద‌ని ద్రాక్ష అయ్యింది! అని కూడా పీసీ అన్నారు.

ప్రియాంక సెట్స్ లో తనకు లభించే గౌర‌వం గుర్తింపు ఇత‌ర విష‌యాల‌ను ఎప్పుడూ ప‌ట్టించుకోలేద‌ని.. ఇది ఇక్క‌డ స‌ర్వ‌సాధారణ విషయం అని తాను ఎలా భావించేదో కూడా చెప్పింది. సెట్ లో గంట‌ల త‌ర‌బ‌డి ఎదురు చూడ‌డం తప్ప‌ద‌ని నేను అనుకునే దానిని. అయితే నాతో న‌టించిన మేల్ స్టార్స్ వారికి అనుకూల స‌మ‌యంలోనే సెట్ లో ప‌ని చేసేవార‌ని పీసీ తెలిపింది.  మేల్ స్టార్లు ఎప్పుడు సెట్ లో క‌నిపించాల‌నుకుంటే అప్పుడే షూటింగును ప్లాన్ చేసేవార‌ని క‌ఠోర నిజాల‌ను వెల్ల‌డించింది పీసీ.

అయితే హాలీవుడ్ లో ఇలాంటి విషయాలు ఎలా విభిన్నంగా ప‌ని చేస్తాయో కూడా మాట్లాడింది. సిటాడెల్ కోసం మొదటిసారిగా  మేల్ కోస్టార్ రిచర్డ్ మాడెన్ తో క‌లిసి ప‌ని చేసాన‌ని చెప్పింది. హాలీవుడ్ లో మొద‌టి సారి కాబ‌ట్టి త‌న‌కు ఏదీ అర్థం కాలేద‌ని వెల్లడించింది. రస్సో బ్రదర్స్ నిర్మించిన సిటాడెల్ ప్రైమ్ వీడియోలో OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. భారీత‌నం నిండిన‌ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ కు పాట్రిక్ మోర్గాన్ దర్శకత్వం వహించారు. ప్రియాంకతో పాటు రిచర్డ్ మాడెన్ స‌హ‌న‌టుడిగా నటించారు. సామ్ హ్యూగన్ తో కలిసి ప్రియాంక అంతర్జాతీయ ప్రాజెక్ట్ 'లవ్ ఎగైన్‌'లో కూడా కనిపించనుంది.

బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ 'జీ లే జరా'లో అలియా భట్ - కత్రినా కైఫ్ లతో కలిసి నటిస్తుంది. ఇది దిల్ చాహ్తా హై - జిందగీ నా మిలేగీ దోబారా  తరువాత స్నేహం అనే కాన్సెప్టుతో రూపొంద‌నున్న మరొక చ‌క్క‌ని క‌థాంశ‌మ‌ని తెలుస్తోంది. ఈ రెండూ కల్ట్ క్లాసిక్ సినిమాలుగా మారాయి. 'జీ లే జరా' త్వరలో సెట్స్ పైకి వెళుతుందని 2023 వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంటుందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News