సినిమాల్లోనే ఉంటే కోట్లు సంపాదించేవాడినే: నటుడు శివాజీ

Update: 2022-07-05 01:30 GMT
శ్రీవిష్ణు హీరోగా 'అల్లూరి' సినిమా రూపొందింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి, ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.

బెక్కెం వేణుగోపాల్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ వేడుకకి వచ్చిన నటుడు శివాజీ మాట్లాడుతూ .. "నాకు చిన్నప్ప టి నుంచి తెలిసిన అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణగారు. అప్పట్లో ఆయనను చూసి అల్లూరి సీతారామరాజు ఇలాగే ఉండేవారేమో అనుకునేవాడిని.

బెక్కెం వేణుగోపాల్ చాలామందిని సినిమా ఫీల్డ్ కి పరిచయం చేశారు .. ఆయనను పరిచయం చేసింది నేనే అని గర్వంగా చెప్పగలను. తను తీయనున్న సినిమాల కథలను నాకు చెబుతూనే ఉంటాడు .. కొన్ని కథలు వద్దని  చెబుతుంటాను. 'అమ్మా నాన్న నా బాయ్ ఫ్రెండ్' చేస్తానంటే నేను వద్దన్నాను. అయినా తీసి తాను చేతులు కాల్చుకున్నాడు. అలాగే ఈ సినిమా కథను కూడా చెప్పాడు. ధైర్యంగా .. హ్యాపీగా చేసుకోవచ్చని చెప్పాను. ఎందుకంటే ఈ దర్శకుడు అంత బాగా దీనిని తయారు చేసుకున్నాడు.

గతంలో పోలీస్ కథలు చాలానే వచ్చాయి. ఈ కథలో ఉన్న కొత్తదనం ఏమిటనేది థియేటర్ కి వెళితే తెలుస్తుంది. పోలీస్   కథల్లో చాలావరకూ హిట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నిజాతీయగా ఉండేవాడిని చూడటానికి మనమంతా కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటాము. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ  హీరోలో తమని తాము ఊహించుకుంటూ ఉంటారు.    అందువల్లనే సినిమాలకి .. ఆర్టిస్టులకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోంది. అలా ఈ సినిమాతో అందరికీ పెద్ద సక్సెస్ వస్తుందని నేను భావిస్తున్నాను.

అల్లూరి జయంతి రోజున ఈ టీజర్ ను రిలీజ్ చేయుటం ఆనందంగా ఉంది. అప్పటి తెల్లదొరలు .. నల్లదొరల రూపంలో ఇప్పటికీ ఇక్కడే ఉన్నారని నా అభిప్రాయం. అలాంటి వాళ్లంతా సమాజాన్ని ఇంకా కిందికి తీసుకుని వెళుతున్నారు. పాలెం బస్సు సంఘటన నన్ను  సినిమాల్లో నుంచి పక్కకి తీసుకుని వెళ్లింది.

లేదంటే ఈ పదేళ్లలో ఓ పది సినిమాలు చేసి పది ..  పదిహేను కోట్లు సంపాదించేవాడిని. దేశం అభివృద్ధి చెందుతుందని అంటున్నారుగానీ .. దేశం ఇప్పటికీ పాలెం బస్సు సంఘటన  దగ్గరే ఉంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకి అల్లూరి భావాలను ఇవ్వడానికి ప్రయత్నించండి" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News