50% ఆకుపెన్సీకి త‌గ్గిస్తే ఆ సినిమాలన్నీ థియేటర్లకు క్యూ క‌ట్టే ఛాన్స్ ఉంది..!

Update: 2021-04-10 06:32 GMT
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ ఇండస్ట్రీలో మళ్ళీ కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ లో సీటింగ్ కెపాసిటీ తగ్గించే అంశం మళ్ళీ చర్చకు వచ్చింది. ఇప్పటికే మహారాష్ట్ర - కర్ణాటక వంటి రాష్ట్రాలలో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమాకు ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం 100 శాతం నుంచి యాభై శాతానికి సీటింగ్ ఆక్యుపెన్సీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి అక్కడ థియేటర్స్ లో 50 శాతం సీటింగ్ రూల్ అమలు కానుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో ఇక్కడ కూడా థియేటర్ ఆక్యుపెన్సీని సగానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలలో 100 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతోనే సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. ఒకవేళ థియేట‌ర్లు 50 శాతం ఆకుపెన్సీకి త‌గ్గిస్తే మాత్రం చిన్న సినిమాలు విడుదలకు క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంది. ఎందుకంటే పెద్ద సినిమాల‌కి రెవెన్యూ రావాలంటే 100 శాతం ఆకుపెన్సీతో థియేట‌ర్లునడవాలి కానీ చిన్న సినిమాలు మాత్రం 50 శాతం ఆకుపెన్సీతో కూడా సేఫ్ అయిపోతాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైన చిన్న సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి. ప్ర‌స్తుతానికైతే సెకండ్ వేవ్ విజృంభ‌న చాలా దారుణంగా ఉంది. జ‌నాలు ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా నుంచి త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లకు వచ్చి సినిమాలు ఎంతమంది చూస్తారనే ఆలోచనతో ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News