'డీజే టిల్లు' హిట్ కొడితే సీక్వెల్ ఖాయమే!

Update: 2022-02-10 03:50 GMT
యూత్ ఇప్పుడు కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. కంటెంట్ కొత్తగా ఉంటే చాలు ..  హిట్ తీసుకొచ్చి దోసెట్లో పెట్టేస్తున్నారు. అలాగే ఒక సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఆ సినిమాకి యూత్ ఎంతవరకూ కనెక్ట్ అవుతున్నారనేది తెలిసిపోతూ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయిన కంటెంట్ ఉన్న సినిమాగా 'డీజే టిల్లు' కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

సాధారణంగా ఈ తరహా టైటిల్స్ తో వచ్చే సినిమాలకి కొత్త నిర్మాతల పేర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాను నిర్మించినది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు. సితార బ్యానర్ ఇంతకుముందు ఎన్నో హిట్లు ఇచ్చి ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగిన సినిమాలనే వారు చేస్తుంటారు. అలాంటిది ఈ సినిమా చేయడానికి వారు ముందుకు వచ్చారంటే మంచి కంటెంట్ ఉండొచ్చునని అంతా అనుకుంటున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ముందుగా 'నరుడి బతుకు నటన' అనే టైటిల్ అనుకున్నారు. అయితే అంత టైటిల్ పలకకుండా, 'టిల్లు' ఎంతవరకూ వచ్చింది? అనే అందరూ అడిగేవారు. దాంతో టైటిల్ మార్చడం జరిగింది. అప్పటి నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ గారు అందించిన సహాయ సహకారాలను ఎప్పటికీ మరచిపోలేము. ఈ సినిమాను ఆయన చూశారు .. హిట్ పక్కా అని చెప్పారు. అయితే ఆ హిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి అన్నారు. అందువలన టీమ్ అంతా కూడా హ్యాపీగా ఉంది.

ఈ కథలో సీక్వెల్ చేయడానికి అవసరమైన స్టఫ్ ఉంది. అందువలన సీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ విషయాన్ని గురించి నేను .. దర్శకుడు మాట్లాడుకున్నాము. ఈ సినిమాను ఫ్రాంచైజీగా ముందుకు తీసుకుని వెళితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాము. అయితే ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ పనులు ఆటోమేటిగ్గా మొదలైపోతాయి. 'డీజే టిల్లు'  చాలా బాగా వచ్చింది కనుక, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నిజమైతే సీక్వెల్ కూడా ముందుకు వెళుతుంది.   

ఈ సినిమాలో తన వంటిపై 16 పుట్టుమచ్చలు ఉన్నట్టుగా హీరోయిన్ చెబుతుంది. 'రియల్ గా ఆమె వంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని ఈవెంట్ లో ఒక జర్నలిస్ట్ అడిగారు. ఊహించని ఆ ప్రశ్నకి స్టేజ్ పై ఉన్న మేమంతా షాక్ అయ్యాము. ఏం చెప్పాలో తెలియక ఆ ప్రశ్నను నేను ఎవైడ్ చేశాను. ఈ విషయంపై ఆ తరువాత ట్విట్టర్ లో స్పందించాను. ఆ హీరోయిన్ కూడా చాలా ఫీల్ అయింది. ఆ జర్నలిస్ట్ సారీ చెప్పడం కూడా జరిగిపోయింది. అప్పుడప్పుడు అనుకోకుండా అలాంటి పొరపాట్లు జరగడం సహజమే" అని చెప్పుకొచ్చాడు.     


Tags:    

Similar News