ఈ క్రేజీ కాంబినేష‌న్లు నిజ‌మైతే అంతేగా..!

Update: 2021-01-22 15:30 GMT
ర‌క‌ర‌కాల క్రేజీ కాంబినేష‌న్ల‌పై ఇటీవ‌ల టాలీవుడ్ లో ప్ర‌చారం సాగిపోతోంది. ఇవ‌న్నీ రూమర్లు అనుకున్నా.. అలా జ‌రిగితే బావుండేది! అన్న భావ‌న అభిమానుల‌కు క‌లుగుతోంది. ప్ర‌స్తుతం అలాంటి ఓ రెండు మూడు గాసిప్స్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నారు. మ‌రోవైపు కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాతో అద‌ర‌గొట్టి ప్ర‌స్తుతం సీక్వెల్ లో న‌టిస్తున్న యష్ తో క‌లిసి న‌టించాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నార‌న్న ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. అలాగే చ‌ర‌ణ్ -య‌ష్ కాంబినేష‌న్ లో భారీ హిస్టారిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ ని తెర‌కెక్కించేందుకు రోబో శంక‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారని .. నాలుగేళ్ల సుదీర్ఘ కాలం తెర‌కెక్కే మూవీ ఇద‌ని ప్ర‌చారం సాగ‌డం మ‌రింత హీటెక్కించేస్తోంది. అయితే ఇది నిజ‌మా? అన్న‌దానికి క్లారిటీ లేదు.

ఆకాశం నీ హ‌ద్దురా లాంటి క్లాసిక్ లో న‌టించి హిట్టు కొట్టిన సూర్య‌తో బోయ‌పాటి మాస్ యాక్ష‌న్ స్క్రిప్టు వ‌ర్క‌వుట్ చేయ‌నున్నాడ‌న్న ప్రచారం ఇటీవ‌ల అంతే వేడెక్కించింది. స్క్రిప్టులో సంథింగ్ ఏదైనా ఉంటే కానీ ఆ సినిమా చేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని సూర్య  .. బోయ‌పాటికి ఎంత‌వ‌ర‌కూ ఓకే చెప్పారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. అయితే తెలుగు ఆడియెన్ అభిరుచిని దృష్టి పెట్టుకునే మాస్ డైరెక్ట‌ర్ కి అవ‌కాశ‌మిస్తున్నారా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఈ గాసిప్ నిజమైతే ఏం జ‌ర‌గోబోతోంది అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.
 
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ ల‌ను క‌లిపి ఓ మాస్ హిట్ తీస్తే బావుంటుంద‌ని గోపిచంద్ మ‌లినేని ప్ర‌య‌త్నిస్తున్నట్టు క‌థ‌నాలొచ్చాయి. క్రాక్ తో ట్రాక్ లోకొచ్చాడు కాబ‌ట్టి ఈ కాంబినేష‌న్ స్క్రిప్టును ప‌ట్టాలెక్కించే వీలుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ మూవీపైనా.. వ‌రుణ్ తేజ్- సాయి తేజ్ కాంబో సినిమాపైనా ర‌క‌ర‌కాల గాసిప్పులు ఇదివ‌ర‌కూ షికార్ చేశాయి. కానీ ఆ కాంబినేష‌న్ సినిమాల‌పై స‌రైన క్లారిటీ లేదు.

చిరంజీవి-ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్ లో త్రివిక్ర‌మ్ మూవీ ఇప్ప‌టివ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు. అశ్వ‌నిద‌త్ - టీఎస్సార్ ఈ మూవీని ప్ర‌క‌టించినా కానీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారున్నారు. అంత పెద్ద స్టార్లను క‌లిపే అద్భుత‌మైన క‌థ ఏదీ కుద‌ర‌క‌పోవ‌డం కూడా ఈ ఫెయిల్యూర్ కి కార‌ణ‌మ‌వుతోంది. ఈ క్రేజీ కాంబినేష‌న్లు నిజంగానే సెట్ట‌యితే బాక్సాఫీస్ వ‌ద్ద బంతాటే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News