ఇళయరాజా ఏం పాపం చేశాడు?

Update: 2015-12-21 09:30 GMT
మేస్ట్రో ఇళయరాజా పాపం అనవసరంగా వివాదంలో చిక్కుకున్నారు. వారం రోజులుగా తమిళనాడును కుదిపేస్తున్న బీప్ సాంగ్ వివాదంలోకి ఆయన్ని లాగేశారు జనాలు. అసలు వివాదం మరిచిపోయి.. ఇప్పుడంతా ఇళయరాజా మీద పడిపోతున్నారు. సమయం సందర్భంగా లేకుండా బీప్ సాంగ్ గురించి ఇళయరాజాను అభిప్రాయం అడగడం.. ఆయనకు ఒళ్లు మండి విలేకరిని తిట్టిపోవడం.. దీని మీద మీడియా అంతా ఒక్కటై ఇళయరాజా మీద పడుతుండటంతో తమిళనాట అసలు వివాదం పక్కకు వెళ్లిపోయి ఇదే చర్చనీయాంశం అవుతోంది.

చెన్నై వరదల సమయంలో ఇళయరాజా స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్లి సాయపడి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో వరద బాధితులకు సాయపడిన మిగతా వాళ్లందరినీ కూడా కలుపుకుని ఈ మధ్య ఓ థ్యాంక్స్ మీట్ ఒకటి పెట్టింది కోలీవుడ్. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఇళయరాజా మైకందుకుని దాని గురించి మాట్లాడుతుండగా.. ఓ విలేకరి ‘బీప్ సాంగ్ పై మీ అభిప్రాయమేంటి’ అని అడిగాడు. దీంతో ఆయనకు ఒళ్లు మండి.. ‘బుద్ధి ఉందా లేదా. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నా అది’ అంటూ ఫైర్ అయిపోయారు. ఐతే వంద మంది జర్నలిస్టులున్న కార్యక్రమంలో ఇళయరాజా ఇలా ఓ జర్నలిస్టును తిట్టేసరికి అది పెద్ద వార్త అయి కూర్చుంది. బీప్ సాంగ్ కు సంబంధించిన అసలు గొడవను మరిచిపోయి ఇళయరాజా వ్యాఖ్యల మీదే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మీడియా అంతా కూడా ఒక్కటైంది.

మరోవైపు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నంలో పడ్డాడు. ఇళయరాజానే బీప్ సాంగ్ గురించి ఎందుకు అడిగారని.. అనిరుధ్ బంధువైన రజినీకాంత్ ను అడగొచ్చు కదా అంటూ ఆయన మరింత అగ్గి రాజేసే పనిలో పడ్డాడు. ఇక మేస్ట్రో తనయుడు కార్తీక్ రాజా తన తండ్రిని వివాదంలో లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వరద బాధితులను ఆదుకునేందుకు తన తండ్రి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నాడని.. మంచి ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమంలో సంబంధం లేని ప్రశ్న అడిగేసరికి కోపం వచ్చిందని.. ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా ఇంతటితో ముగింపు పలకాలని కార్తీక్ మీడియాకు విజ్నప్తి చేశాడు.
Tags:    

Similar News