ఇళయరాజా పోరాటం మొదలెట్టాడు

Update: 2015-07-04 15:30 GMT
దక్షిణాది సినిమా మీద ఇళయరాజా సంగీతం ప్రభావం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో అద్భుతమైన పాటలతో ఓ తరం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు రాజా. ఇప్పటి యూత్‌ కూడా ఇళయరాజా పాటలంటే చెవి కోసుకుంటుందంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఐతే తన సంగీతంతో ఇన్ని కోట్ల మందికి ఆనందం కలిగిస్తున్న ఇళయరాజాకు ఓ సంస్థ తీరని అన్యాయం చేస్తోంది. స్టేజ్‌ షోలు జరిగినపుడు అక్కడ పాడే పాటలకు సంబంధించి.. కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఆ పాటలకు సంబంధించిన రాయల్టీ వసూలు చేస్తున్న ఇండియన్‌ పెర్ఫామింగ్‌ రైట్‌ సొసైటీ.. ఆ డబ్బులు మ్యూజిక్‌ డైరెక్టర్లకు ఇవ్వట్లేదు.

నిబంధనల ప్రకారం సర్‌ఛార్జి మినహాయించుకుని మిగతా రాయల్టీ అంతా మ్యూజిక్‌ డైరెక్టర్లకు ఇవ్వాలి. సౌత్‌ ఇండియాలో ఎక్కడ ఏ స్టేజ్‌ షో జరిగినా ఇళయరాజా పాటల్లేకుండా ఆ కార్యక్రమాలు సాగవు. ఈ లెక్కన ఇళయరాజాకు రాయల్టీ భారీగానే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో తనకు ఇండియన్‌ పెర్ఫామింగ్‌ సొసైటీ అన్యాయం చేస్తోందని ఇళయరాజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఓ ఆడియో కంపెనీతో కూడా రాయల్టీ విషయంలో ఆయనకు వివాదం చెలరేగింది. వేల కొద్దీ అద్భుతమైన పాటల్ని సృష్టించిన రాజాకు.. ఆ పాటల ద్వారా వచ్చే రాయల్టీని తీసుకునే హక్కుంది. అందుకే ఆర్కెస్ట్రాలు నిర్వహించే మ్యుజీషియన్స్‌, సింగర్స్‌ అసోసియేషన్స్‌ అధ్యక్షుల్ని పిలిచి సమావేశం నిర్వహించారు రాజా. తనకు రావాల్సిన రాయల్టీ కోసం పోరాడుతున్నానని.. తనకు సహకరించాలని కోరారు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్లాలని.. తనకు దక్కాల్సింది దక్కించుకోవాలని పోరాడుతున్నారు రాజా. ఆయనకు న్యాయం జరగాలని కోరుకుందాం.

Tags:    

Similar News