ఇంద్రగంటి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడండీ...

Update: 2017-07-04 07:10 GMT
కొందరేమో సినిమాల్లో సందేశాలిస్తే ఎవరు చూస్తారండీ అంటారు. ఇంకొందరేమో సినిమాల ద్వారా మంచి చెప్పకపోయినా.. చెడు మాత్రం చూపించొద్దని అంటారు. ఐతే సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఇంతకంటే పవర్ ఫుల్ మీడియా మరొకటి లేదన్నదీ నిజం. ఈ విషయాన్ని గుర్తించి కొందరు దర్శకులు జాగ్రత్తగా సినిమాలు తీస్తుంటారు.

హీరోయిన్లు చూపించే విషయంలో.. డైలాగుల విషయంలో.. కథాంశాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉంటుంటారు. విలువలు పాటిస్తారు. ఆ కోవలోకే వస్తాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన సినిమాల్లో తెలుగుదనం ఉంటుంది. అసభ్యత ఉండదు. మాటల్లో బూతులుండవు. కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం ఇంద్రగంటి ఎన్నడూ చేసింది లేదు. ఇంద్రగంటి లేటెస్ట్ మూవీ ‘అమీతుమీ’ చూస్తే.. ఒక్క బూతు లేకుండా చక్కటి వినోదం పండించారయన.

ఉద్దేశపూర్వకంగానే తాను తన సినిమాల మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటుంటానని చెప్పాడు ఇంద్రగంటి. కాసులు రాబట్టడం కోసం తాను ఎప్పుడూ అడ్డదార్లు తొక్కనని ఇంద్రగంటి తేల్చి చెప్పాడు. బూతులు కావాలని.. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండాలని ప్రేక్షకులేమీ డిమాండ్ చేయరని.. ఆరోగ్యకరమైన హాస్యాన్ని వాళ్లకు అందించి.. వాళ్లను దానికి అలవాటు పడేలా చేయడం దర్శకుల బాధ్యత అని ఇంద్రగంటి స్పష్టం చేశాడు.

క్లీన్ కామెడీ అందరికీ చేరకపోవచ్చని.. ఓ వర్గం ప్రేక్షకుల్ని సినిమాకు అది దూరం చేయొచ్చని.. ఐతే తాను మాత్రం అలాంటి ప్రేక్షకుల్ని కోల్పోవడానికి సిద్ధమే కానీ.. రాజీ పడి బూతు డైలాగులు మాత్రం తన సినిమాలో పెట్టనని ఇంద్రగంటి స్పష్టం చేశాడు. బూతు కామెడీ రాయడం ఈజీ అని.. పద్ధతిగా రాయడం కష్టమని.. కానీ ఈ కష్టాన్నే తాను ఇష్టపడతానని ఇంద్రగంటి తేల్చి చెప్పాడు. ఈ రోజుల్లో ఇలా విలువలకు కట్టుబడుతూ.. అవసరమైతే ప్రేక్షకుల్ని వదులకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించే గట్స్ ఉన్న దర్శకులు అరుదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News