కరోనా క్రైసిస్ లో ఎగ్జిబిషన్ రంగానికి అన్ని వేల కోట్ల నష్టం వాటిల్లిందా...?

Update: 2020-10-15 17:00 GMT
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చవి చూస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడున్నర నెలలుగా థియేటర్స్ మూతబడి ఉన్నాయి. దీని కారణంగా సినీ రంగంలో ఎక్కువగా నష్టపోయింది ఎగ్జిబిటర్స్ అని చెప్పవచ్చు. థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రొడ్యూసర్స్ అందరూ నష్టాల నుంచి బయటపడటానికి ఓటీటీలను ఆశ్రయించారు. ఇన్ని నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి.. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేసినా రిలీజ్ చేయడానికి కంటెంట్ లేక ఎగ్జిబిటర్ రంగం దాదాపుగా కుదేలైపోయింది. ఈ ఏడున్నర కాలంలో ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ రూ.10000 కోట్లకు పైగా నష్టపోయిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కరోనా లాక్‌ డౌన్‌ సడలింపులతో సినిమా పరిశ్రమలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు.

50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ మల్టీప్లెక్సులు తేర్చుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా తీవ్రత తగ్గే వరకూ ఎగ్జిబిటర్స్ నష్టాల నుంచి బయటపడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓనర్స్ లాభాలు పొందలేరు. అందులోనూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ రన్ చేయడమంటే అది వారికి అదనపు భారమనే అనుకోవచ్చు. దసరా - దీపావళి ఫెస్టివల్ సీజన్ వస్తున్నా కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు జనాలు థియేటర్స్ కి రావడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News