'బిగ్ బాస్' వాళ్ళ కెరీర్ కు ఏ మాత్రం ప్లస్ అయింది..??

Update: 2021-07-13 13:30 GMT
తెలుగు టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో లలో 'బిగ్ బాస్' ఒకటి. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న తెలుగు 'బిగ్ బాస్' సీజన్-5 పై రోజులు గడిచే కొద్దీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'స్టార్ మా' వారు ''బిగ్ బాస్ 5'' గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ నుంచి కొంత మందిని ఫిల్టర్ చేయగా.. సెకండ్ రౌండ్ లో వారిలో కొందరిని తదుపరి రౌండ్ కు సెలెక్ట్ చేస్తున్నారట.

ఇప్పటి వరకు జరిగిన 'బిగ్ బాస్' ఐదు సీజన్లను గమనిస్తే.. 'బిగ్ బాస్ 1' లో కంటెస్టెంట్స్ గా అందరూ పాపులర్ సెలబ్రిటీలు కనిపించారు. ఆ తరువాత వచ్చిన రెండో సీజన్‌ లో పాపులర్ సెలబ్రిటీల సంఖ్య తగ్గింది. 'బిగ్ బాస్-3' నుంచి కంటెస్టెంట్స్ గా సినీ సెలబ్రిటీలు - టీవీ యాంకర్లతో పాటుగా సోషల్ మీడియా స్టార్స్ వచ్చారు. కాకపోతే వీరిలో ఎక్కువ మంది పెద్దగా పాపులారిటీ లేనివారే ఉన్నారు. ఇక తెలుగు 'బిగ్ బాస్ 4' లో మాత్రం కంటెస్టెంట్స్ ఎంపిక మరీ నాసిరకంగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. వీళ్ళలో ఎక్కువ శాతం 'బిగ్ బాస్‌' కి వచ్చిన తరువాత గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. షో వల్ల సెలబ్రిటీలుగా మారారు అంటే 'బిగ్ బాస్' సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు.

అయితే 'బిగ్ బాస్' రియాలిటీ షో లో పాల్గొనడం ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారికి.. చివరి దాకా ఉండి విన్నర్స్ గా నిలిచిన వారికి ఈ షో ఏ మాత్రం ఉపయోగపడిందనే దాని గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్-1 లో హీరో శివ బాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచారు. కొన్ని సినిమాల్లో హీరోగా.. సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న శివ బాలాజీ.. హౌస్ నుంచి బయటకు వచ్చాక సినిమాల్లో పెద్దగా కనిపించలేదనే అనుకోవాలి. ఒకటీ రెండు పెద్ద సినిమాలు చేసినా అవి శివబాలాజీ కెరీర్ కు ఉపయోగపడలేదు.

నాని హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 2' షో లో కౌశల్ మండా విన్నర్ గా నిలిచాడు. డిఫరెంట్ యాటిట్యూట్ తో హౌస్ లో హల్ చల్ చేసిన ఈ యాక్టర్ కోసం.. సోషల్ మీడియాలో ఆర్మీలు కూడా వెలిశాయి. ఇక టైటిల్ తో బయటకు వచ్చిన తర్వాత ఫలానా స్టార్ హీరో సినిమాలో లీడ్రోల్ చేస్తున్నాడని.. ఆ స్టార్ డైరెక్టర్ దృష్టిలో పడ్డాడని రోజుకో వార్త వచ్చేది. అయితే ఒక్క పెద్ద సినిమాలో కూడా కౌశల్ కనిపించలేదు. కాకపోతే ఎప్పటిలాగే సీరియల్స్ తో బిజీ అయిపోయాడు.

అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 3' లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుపొందారు. అప్పటికే సింగర్ గా పాపులర్ అయిన రాహుల్.. ప్రైవేట్ సాంగ్స్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకొని ఉన్నాడు. 'బిగ్ బాస్ 3' టైటిల్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఇల్లు కట్టుకోవడం - కారు కొనడం ద్వారా వ్యక్తిగతంగా అభివృద్ధి కనిపించింది. ఇక నాగ్ హోస్టింగ్ చేసిన నాల్గవ సీజన్ లో యువ హీరో అభిజిత్ 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో కనిపించిన అభిజీత్ కెరీర్ మారిపోతుందని అందరూ భావించారు. అయితే ఇంతవరకు 'బిగ్ బాస్' సీజన్-4 విన్నర్ మాత్రం ఓ సినిమాకి కమిట్ అయినట్లు అధికారికంగా వెల్లడించలేదు.

ఇదంతా చూస్తుంటే 'బిగ్ బాస్' విన్నర్లకు షో వల్ల పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదని అర్థం అవుతుంది. కాకపోతే ఇందులో పాల్గొన్న మిగతా కంటెస్టెంట్స్ మాత్రం బాగానే క్రేజ్ తెచ్చుకుని అవకాశాలు అందుకోవడం గమనార్హం. గత సీజన్ లో పాల్గొన్న మోనాల్ - అఖిల్ - సోహైల్ - అరియనా - అవినాష్.. అలానే అంతకుముందు సీజన్లలో ప్రిన్స్ - శ్రీముఖి - అలీ రజా - కత్తి మహేష్ - మహేష్ విట్టా - నందినీ రాయ్ వంటి వారు 'బిగ్ బాస్' షో వల్ల మరింత పాపులారిటీ తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ 5' వల్ల ఎంతమంది సెలబ్రిటీలుగా మారుతారు.. ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి. ఇకపోతే తెలుగు 'బిగ్ బాస్ 5' సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు 'స్టార్ మా' వారు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News