మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డ్డ చందం

Update: 2022-09-10 16:30 GMT
గ‌డిచిన కొంత‌కాలంగా వ‌రుస చిత్రాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో బాలీవుడ్ పూర్తిగా నీరుగారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అక్క‌డ స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్ట‌ర్లు ఫిలింమేక‌ర్స్ లో తోపులు అని చెప్పుకున్న వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. హిందీ సినిమాకి స‌రైన ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డంతో త‌మ మేధోత‌నంపై త‌మ‌కే సందేహం క‌లిగింది. ఇప్పుడు అక్క‌డ అంతా క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. దీంతో ఒక‌రొక‌రుగా ద‌క్షిణాది సినిమా గొప్ప‌త‌నాన్ని పొగ‌డ‌టం అల‌వాటు చేసుకుంటున్నారు. నెమ్మ‌దిగా మ‌త్తు దిగి వాస్త‌వంలోకి వ‌స్తున్నారు.

అయితే చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు! అన్న  చందంగా ఇంకా అక్క‌డివారికి బింకం చావ‌లేదు. ఇప్ప‌టికీ త‌మ సినిమాని వెన‌కేసుకొచ్చేందుకు ఒక సెక్ష‌న్ పాకులాడ‌డం బ‌య‌ట‌ప‌డుతోంది. పృథ్వీరాజ్ సామ్రాట్- ర‌క్షాబంధ‌న్-లాల్ సింగ్ చ‌డ్డా స‌హా ఎన్నో బాలీవుడ్ సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో ప‌రిశ్ర‌మ ఎటు పోతోందో ఏమైపోతోందోన‌న్న బెంగ ప‌ట్టుకున్న మాట వాస్తవం. ప‌నిలో ప‌నిగా నేడు రిలీజైన బ్ర‌హ్మాస్త్ర కూడా ఫ్లాపైతే ఇక బాలీవుడ్ ని ప‌ట్టించుకునే వాళ్లే ఉండ‌ర‌న్న భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

అయితే ఇలాంటి సందిగ్ధ‌త‌ల న‌డుమ నేడు రిలీజైన బ్ర‌హ్మాస్త్ర‌కు హిందీ మీడియా వంత పాడుతుంటే... తెలుగు మీడియాలో నెగెటివ్ రివ్యూలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. బాలీవుడ్ మీడియాలు మాత్రం 'బ్ర‌హ్మాస్త్ర' విష‌యంలో సాఫ్ట్ కార్న‌ర్ ని చూపించ‌డం పాజిటివ్ రివ్యూలు ఇచ్చేందుకు త‌హ‌త‌హ‌లాడ‌డం క‌నిపించింది.ఒక ఇదీ పోతే త‌మ ప‌రువు పోతుంద‌ని కూడా మీడియాలో చ‌ర్చ సాగిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఇంత‌కుముందే బ్ర‌హ్మాస్త్ర‌పై కంగ‌న నుంచి ఒరిజిన‌ల్ హానెస్ట్ రివ్యూ అందింది. ఈ సినిమా దెబ్బ‌కు 800 కోట్లు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంద‌ని కూడా పంచ్ విసిరింది కంగ‌న‌. మొదటి రోజు ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌ను బ్ర‌హ్మాస్త్ర కొట్టేస్తోందంటూ ప్ర‌చారం కూడా సాగిపోయింది. కానీ ఇదంతా ఉత్తుత్తి ప్ర‌చార‌మేన‌ని కూడా తాజా స‌న్నివేశం చెబుతోంది.

బ్ర‌హ్మాస్త్ర కంటెంట్.. ఎమోష‌న్ ప‌రంగా తేలిపోయింద‌న్న రిపోర్టుల న‌డుమ ఈ వీకెండ్ ఎలాంటి వ‌సూళ్ల‌ను తెస్తుంది? అన్న‌దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. తొలి రెండు మూడు రోజుల్లో సెల‌వులు ఈ సినిమాకి క‌లిసొచ్చే వీలుంది. ఆ త‌ర్వాత కూడా మైలేజ్ ద‌క్కించుకుంటేనే ఈ మూవీ పై భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌వారికి రిక‌వ‌రీ సాధ్య‌ప‌డుతుంది.

భారీగా పెంచేసిన టికెట్ ధ‌ర‌ల‌తో జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఒక టికెట్ కి 350 పైగా ఖ‌ర్చు చేసి థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా లేరు. ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లోనూ ఇంత‌కుమించిన గొప్ప స‌న్నివేశం క‌నిపించ‌ద‌ని భావిస్తున్నారు. మూవీకి యునానిమ‌స్ గా సూప‌ర్ హిట్ అన్న టాక్ వ‌స్తే కానీ ఈరోజుల్లో సినిమాలు ఆడ‌డం లేదు.

అయితే బ్ర‌హ్మాస్త్ర‌ను థియేట‌ర్ల‌లో వీక్షిస్తున్న రియ‌ల్ ఆడియెన్ ఏమంటున్నారు?   వారు మౌత్ టాక్ ని ఏమ‌ని స్ప్రెడ్ చేస్తున్నారు? అన్న‌దానిని కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంది. ఒక ర‌కంగా బ్ర‌హ్మాస్త్ర‌ను భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ ఏ మేర‌కు కాపాడ‌తాయి? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మూలిగే న‌క్క మీద తాటి పండు ప‌డ్డ చందంగా బాలీవుడ్ స‌న్నివేశం ఇప్పుడేమీ బాలేదు. మునుముందు  హృతిక్ - సైఫ్ ల విక్ర‌మ్ వేద.. షారూక్ ఖాన్ ప‌ఠాన్ చిత్రాల‌తో మంచి హిట్లు ద‌క్కుతాయేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News