'ట్రిపుల్ ఆర్' ఆస్కార్ కు వెళ్లే ఛాన్సే లేదా?

Update: 2022-06-10 14:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ట్రిపుల్ ఆర్‌'.  స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్ర‌మిది. లెజెండ్స్‌.. స్వాతంత్య్ర పోరాటంలో త‌మ‌దైన పంథాలో పోరాడి వీరులుగా చ‌రిత్ర‌లో నిలిచిన అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంల క‌ల‌యిక అనే ఓ ఫిక్ష‌న‌ల్ స్టోరీని భారీ స్థాయిలో ఆవిష్క‌రించిన సినిమా ఇది. మార్చిలో విడుద‌లైన ఈ  మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

వ‌సూళ్ల ప‌రంగా 1100 ల కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి మ‌రోసారి తెలుగు సినిమా స‌త్తాని యావ‌త్ ప్ర‌పంచానికి చాటి చెప్పింది. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌, కొమురం భీం గా ఎన్టీఆర్ ల న‌ట‌నకు దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ప్రేక్ష‌కుల  ప్ర‌శంస‌ల‌తో పాటు రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని కూడా రాబ‌ట్టిన ఈ మూవీ మే 20 నుంచి ఉత్త‌రాది వెర్ష‌న్ లు జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్ష‌న్ స్ట్రిమింగ్ అవుతోంది. ఇదిలా వుంటే హిందీ వెర్ష‌న్ నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లిష్ మూవీస్ ల త‌రువాత అత్య‌ధిక శాతం మంది వీక్షించిన సినిమాగా స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.  

నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని చూస్తున్న అమెరిక‌న్స్‌, హ‌లీవుడ్ యాక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా సినిమాని ప్ర‌చారం చేస్తూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై అభినంద‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా అన్ని వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించిన 'ట్రిపుల్ ఆర్‌' ఆస్కార్ కి నామినేష‌న్ సాధిస్తుందా? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది సినీ ల‌వ‌ర్స్ ఈ ప్ర‌శ్నని లేవ‌నెత్తుతున్నారు.

సాధార‌ణంగా ఆస్కార్ కు ఉత్త‌మ‌ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయ్యే వాటిల్లో ఎక్కువ‌గా ఆర్ట్ మూవీస్‌, క‌ళాత్మ‌క చిత్రాలు మాత్ర‌మే ఎంపిక‌వుతుంటాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు పెద్ద‌గా స్కోప్ వుండ‌దు.  కానీ ఇటీవ‌ల అమెరిక‌న్స్‌, హాలీవుడ్ న‌టులు, 'డాక్ట‌ర్ స్ట్రేంజ్' మూవీ  రైట‌ర్  'ట్రిపుల్ ఆర్‌'పై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే కాకుండా 'లాలా లాండ్' వంటి మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీతో పోల్చ‌డంతో మ‌న వాళ్లు ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ కావ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే గ‌త కొంత కాలంగా భార‌త్ నుంచి ఆస్కార్ కు వెళ్లే సినిమాల‌ని ప్ర‌త్యేక టీమ్ ఎంపిక చేస్తూ వ‌స్తోంది. ఆ టీమ్ 'ట్రిపుల్ ఆర్‌'ని ఆస్కార్ కు ఎంపిక చేయ‌డం క‌ష్ట‌మే. అస్సామీ, లేదా క‌ళాత్మ‌క చిత్రాలు.. లేదా బాలీవుడ్ చిత్రాల‌ని మాత్ర‌మే ఎంపిక చేసి పంపించే ఇండియ‌న్ ఆస్కార్ క‌మిటీ 'ట్రిపుల్ ఆర్‌' ని ఎంపిక చేయ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఎవ‌రైనా గ‌ట్టిగా సిఫార‌సు చేస్తే త‌ప్ప ఆస్కార్ టీమ్ ఎంపిక చేసే ఆస్కారం క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ ఇక్క‌డ ఎవ‌రైనా ప్ర‌భుత్వ ప‌రంగా గ‌ట్టిగా సిఫార‌సు చేస్తే.. అది ఆస్కార్ కు వెళ్ల‌గ‌లిగితే ఖ‌చ్చితంగా చ‌రిత్ర సృష్టించడం ఖాయం అని చెబుతున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మ‌రి ఆ మ్యాజిక్ జ‌రిగేనా?.
Tags:    

Similar News