మైత్రీకి పోటీగా అక్క‌డ దిల్‌రాజు ఆఫీస్ తీస్తున్నారా?

Update: 2022-12-20 11:30 GMT
టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూష‌న్ వివాదం మ‌రింత‌గా ముదురుతోందా?.. ఒక‌రిని మించి ఒక‌రు ప‌లు ఏరియాల్లో త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి పోటీప‌డ‌తున్నారా? అంటే టాలీవుడ్ లో తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలని చూస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. పైకి మా మ‌ధ్య పోటీ లేదు లేదంటూనే స్టార్ ప్రొడ్యూస‌ర్ లు పంపీణి రంగంలో తెలివిగా పావులు క‌దుపుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గ‌త కొంత కాలంగా టాలీవుడ్ లో స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీగా ఓ వెలుగు వెలుగుతున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు కొత్త‌గా నైజాం పంపిణీ రంగంలోకి అడుగు పెట్ట‌డం తెలిసిందే.

సీడెడ్ కు చెందిన పంపినీ దారుడు శ‌శితో క‌లిసి నైజాంలో మైత్రీ వారు పంపిణీ సంస్థ‌ని ఏర్పాటు చేస్తూ హైద‌రాబాద్ లో కొత్త ఆఫీస్ ని తెరిచారు. ఇక్క‌డి నుంచే అస‌లు ఫైట్ మొద‌లైంది. కొత్త‌గా పంపిణీ సంగంలోకి ప్ర‌వేశించిన మైత్రీ వారు తాము నిర్మాస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' సినిమాల‌ని స్వ‌యంగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు నైజాంలో ఆధిప‌త్య పోరుకు తెర‌లేపింది. దీన్ని సాకుగా తీసుకున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు రంగంలోకి దిగాడు.

నైజాం, ఆంధ్రాలో పంపిణీ రంగంలో వున్న కొంత మందిని ఓగ్రూపుగా మార్చి సీడెట్ లో కొత్త‌గా డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్‌ని ప్రారంబభించాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దిల్ రాజుతో ఏషియ‌న్ వారు కూడా జ‌త‌క‌డుతున్నార‌ట‌. మంగ‌ళ‌వారం దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. చాలా వ‌ర‌కు పంపిణీదారులు ఈ స‌మావేశంలో పాల్గొన్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. త్వ‌ర‌లోనే సీడెడ్ లో కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

సీడెడ్ వైపు ఇంత వ‌ర‌కు ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ చూడ‌లేదు. కార‌ణం అక్క‌డ గంప గుత్త‌గా కాకుండా జిల్లాల వారిగా సినిమా పంపిణీ అవుతూ వుంటుంది. అంటే అక్క‌డ జిల్లాకో పంపిణిదారుడు వున్నార‌న్న‌మాట‌. అయితే తాజాగా దిల్ రాజు, ఏషియ‌న్ వారు రంగంలోకి దిగ‌డంతో అక్క‌డున్న వారిని కొంత మందిని క‌లుపుకుని ఓ సిండికేట్ గా మార్చి కొత్త పంపిణీ ఆఫీస్ ని ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌.

ఈ గ్రూప్ లో ఇప్ప‌టికే సీడెడ్ లో పంపినీ వ్య‌వ‌స్థ‌, థియేట‌ర్లు వున్న‌యువీ వారు కూడా చేరితే భారీ కూట‌మిగా మార‌డం ఖాయం అని చెబుతున్నారు. మైత్రీవారిపై వున్న పంతం కార‌ణంగానే దిల్ రాజు, ఏషియ‌న్ వారు  ఇదంతా చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News