ఏపీలో ఆన్-లైన్ సినిమా టికెటింగ్ కు సర్వం సిద్ధమేనా..?

Update: 2022-03-29 09:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్లు కనిపిస్తోంది. గతేడాది ఏప్రిల్ లో టికెట్ రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో అది వివాదంగా మారింది. దీంతో ఇటీవల సినిమా టికెట్ల విషయంలో సరికొత్త జీవోని విడుదల చేసి టికెట్ ధరలను పెంచారు.

అటు ప్రజలకు భారం కాకుండా ఇటు నిర్మాతలకు నష్టం కలగకుండా ఉండేలా టికెట్ రేట్లు నిర్ణయించినట్లు ఏపీ సర్కారు పేర్కొంది. కొత్త జీవో పై టాలీవుడ్ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆన్ లైన్ పోర్టల్ లో సినిమా టికెట్ల అమ్మకాల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా టికెట్ల విక్రయాలు కోసం ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ ని తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలోనే తెలియచేసారు. టికెట్ల అమ్మకాల బాధ్యతను APFCకి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆల్ లైన్ టికెటింగ్ ను సినీ ప్రముఖులు సైతం స్వాగతించారు. అసలు ఈ విధానాన్ని తీసుకురమ్మని కోరింది తామేనని పలువురు టాలీవుడ్ పెద్దలు తెలిపారు.

వీలైనంత త్వరగా ఆన్‌ లైన్‌ సినిమా టికెటింగ్‌ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆ మధ్య ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ క్రమంలో ఆన్లైన్ సినిమా టికెట్లు గేట్ వే ఏర్పాటు చేయడం కోసం ప్రైవేటు టిక్కెటింగ్ సంస్థల్ని టెండర్లకి ఆహ్వానించింది.

దీని కోసం బుక్ మై షో - జస్ట్ టిక్కెట్ వంటి పలు కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. అయితే ఇందులో ఎల్ 1 గా జస్ట్ టిక్కెట్ నిలిచి ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్స్ నిర్వహణని సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకులపై సర్వీస్ చార్జీల భారం పడకుండా.. ఇతర ప్రైవేట్ పోర్టల్స్ కంటే తక్కువకే ప్రభుత్వమే దీనిని నిర్వహించబోతుంది. అన్ని థియేటర్లు ప్రభుత్వం నిర్దేశించిన సంస్థ ద్వారా టిక్కెట్లను విక్రయిస్తారని తెలుస్తోంది.

ఆన్లైన్ టికెట్ విధానంలో ప్రభుత్వానికి వచ్చిన మొత్తాన్ని థియేటర్ల ఓనర్లకు డిస్ట్రిబ్యూటర్లకు చెల్లిస్తారట. ఒకవేళ జస్ట్ టిక్కెట్‌ కు కాంట్రాక్ట్ ఇచ్చేది నిజమే అయితే.. మెగా కాంపౌండ్‌ కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ అవకాశం అందినట్లుగా భావించవచ్చనే టాక్ ఇప్పుడు నడుస్తోంది.

ఎందుకంటే జస్ట్ టిక్కెట్ కు అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్ డైరక్టర్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇతర బుకింగ్ పోర్టల్స్ కన్నా తక్కువ సర్వీస్ చార్జీలు తీసుకునేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చిందట. అయితే ఆన్లైన్ టికెట్ విధానం ఎలా ఉండబోతుందో.. ఎవరికి లాభం చేకురుస్తుందో.. ఎవరికి నష్టం కలిగిస్తుందో అనే ప్రధాన అందరిలోనూ ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వమే ఆన్లైన్ టికెట్స్ అమ్మితే బుక్ మై షో - పేటీఎమ్ వంటి సినిమా టికెటింగ్ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఏపీ తీసుకొచ్చే ఆన్లైన్ టికెట్ పోర్టల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ విధానం వల్ల బ్లాక్ టికెట్ దందాకు కళ్లెం వేయొచ్చని అంటున్నారు.

అయితే దర్శకుడు కె. రాఘవేంద్రరావు వంటి కొందరు మాత్రం ఆన్‌ లైన్ సిస్టం వల్ల దోపిడీ ఆగిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదని ఆ మధ్య ఓ లేఖలో పేర్కొన్నారు. ఆన్లైన్ టిక్కెట్ గేట్ వే పై స్పష్టత రావాలంటే అధికారిక జీవో వచ్చే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News