రీమేకులకు బ్రేకులు వేయడం సాధ్యమేనా..?

Update: 2022-10-13 02:30 GMT
'రీమేక్స్' మనకు కొత్త కాదు. ఒక భాషలో విజయం సాధించిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. మన దగ్గర హిట్టైన చిత్రాలను ఇతర భాషల్లోకి తీసుకెళ్తుంటే.. అక్కడ సక్సెస్ అయిన కంటెంట్ ను మనం అరువు తెచ్చుకుంటున్నాం.

రీమేక్స్ వెనుక ఉద్దేశ్యం మంచి కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాలానేది ఒకటైతే.. ఆల్రెడీ ఆదరణ పొందిన కంటెంట్ కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుందని భావించడం మరొక కారణంగా చెప్పొచ్చు. బిజినెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిర్మాతలు అనుకుంటారు.

హీరోలు సైతం రిస్క్ ఫ్యాక్టర్ తక్కువని.. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో పోటీపడి మరీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకుంటుంటారు. ఇందులో భాగంగా కొందరు ఫ్రెంచ్ - స్పానిష్ - కొరియన్ చిత్రాల రీమేక్ హక్కులను కొనుగోలు చేస్తున్నారు.

రీమేక్స్ అంటే చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని.. అసలు నటుడికి నిజమైన ఛాలెంజ్ ఇచ్చేవి అవే అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయ పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి చిరు రీమేక్స్ తో ఎన్నో హిట్లు - సూపర్ హిట్లు అందుకున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా రీమేకులలో బెస్ట్ గా నిలిచారు.

టాలీవుడ్ లో నందమూరి తారకరామారావు తన కెరీర్ లో అత్యధికంగా 50 రీమేక్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు 42 రీమేక్స్ చేశారు. వెంకటేశ్ మరియు కృష్ణంరాజు చెరో 25 రిమేక్ సినిమాల్లో నటించారు. 17 రీమేకులు చేసిన చిరంజీవి.. మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. నాగార్జున - బాలకృష్ణ చెరో 12 రీమేక్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో 27 చిత్రాల్లో నటిస్తే.. అందులో ఫ్రీమేక్ ని మినహాయించి 11 రీమేక్ సినిమాలు ఉండటం గమనార్హం. ఇప్పుడు మరో రెండు రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. సీనియర్ హీరో కృష్ణ సైతం 10 రీమేక్స్ చేశారు. ఇప్పుడున్న స్టార్ హీరోలలో మహేష్ బాబు మినహా దాదాపు మిగతా హీరోలంతా ఒకటీ రెండు రీమేక్స్ సినిమాలు చేశారు.

అయితే 'రీమేక్' అనేది ఒకప్పుడు బాగానే వర్కవుట్ అయింది కానీ.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విస్తృతంగా అభివృద్ధి చెందిన తర్వాత పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఓటీటీలలో ఎప్పటికప్పుడు అన్ని భాషల సినిమాలు అందుబాటులోకి తీసుకొస్తుండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

ఓటీటీలలో సరికొత్త కంటెంట్ ను చూడటానికి అలవాటు పడ్డ ప్రేక్షకులు.. రీమేక్ సినిమాలపై ఆసక్తి కనబరచడం లేదని ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాల వసూళ్లను బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆల్రెడీ తెలుగులో డబ్ కాబడిన చిత్రాలను కూడా రీమేక్ చేస్తున్నారు.

అందుకే ఒరిజినల్ సినిమాతో పోల్చుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తుండటం మనం తరచుగా చూస్తున్నాం. సినిమాలు ప్లాప్ అయినా.. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినా.. రీమేక్స్ కు మాత్రం ఇప్పట్లో బ్రేక్స్ పడేలా కనిపించడం లేదు.

ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు రీమేక్స్ తో దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. మన ఫిలిం మేకర్స్ ఇతర భాషల రీమేక్ రైట్స్ ను పోటీపడి మరీ కొంటున్నారు. అయితే రీమేకులకు స్వస్తి పలికితేనే.. కొత్త కథలు పుడతాయి.. న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది.. ఇది పరిశ్రమ అభివృద్ధికి సహాయం చేస్తుంది. మరి మన హీరోలు ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News