కేజీఎఫ్ మెగాస్టార్ నే ఇబ్బందిపెడుతోందా?

Update: 2022-04-22 11:30 GMT
కడుపునిండా భోజ‌నం తినాల‌ని ఎదురుచూసిన వాడికి పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నాలు గ్యాప్ లేకుండా వ‌డ్డిస్తే ఎలా వుంటుంది. ఇప్ప‌డు తెలుగు ప్రేక్ష‌కుడి ప‌రిస్థితి కూడా అలాగే వుంది. దాదాపు రెండేళ్లుగా భారీ చిత్రాల క‌రువులో వున్న ప్రేక్ష‌కుడికి ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాల‌ని, అందులోనూ మోన్ స్ట‌ర్ హిట్ లు.. బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని అందిస్తే క‌డుపునిండిపోదూ ఇప్ప‌డు ఇదే ఫీలింగ్ లో వున్నాడు తెలుగు ప్రేక్ష‌కుడు. అతి వృష్టి.. అనావృష్టి అన్న‌ట్టుగా వుంది ప్ర‌స్తుత ప‌రిస్థితి. ప్ర‌స్తుత ప‌రిస్థితి ఇప్పుడు వ‌స్తున్న భారీ చిత్రాల‌కు ఇబ్బందిక‌రంగా మారుతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు క్రేజీ అభిమానులు కూడా అవున‌నే చెబుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా భారీ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌లేక‌పోయాయి. అయితే తాజాగా ప‌రిస్థితులు మార‌డంతో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేయ‌డం మొద‌లుపెట్టాయి. ఒకే నెల‌లో ప్రేక్ష‌కులు దాదాపు మూడేళ్లుగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రెండు వారాల వ్య‌వ‌ధిలో విడుద‌ల‌య్యాయి. మార్చిలో ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, జ‌క్క‌న్న ట్రిపుల్ ఆర్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.

రిలీజ్ కు ముందు రిలీజ్ త‌రువాత ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 'సాహో' త‌రువాత ప్ర‌భాస్ న‌టించిన సినిమా కావ‌డంతో 'రాధేశ్యామ్‌' కోసం భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఫ‌లితం సంతృప్తిక‌రంగా లేక‌పోయినా ప్ర‌భాస్ సినిమా కావ‌డంతో ఈ చిత్రానికి రిలీజ్ ముందు నుంచి భారీ హైప్ క్రియేట్ అయింది. డివైడ్ టాక్ మొద‌లైనా రెండ వారాల వ‌ర‌కు ఈ సినిమా జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆ త‌రువాత మార్చి 25న 'ట్రిపుల్ ఆర్‌'విడుద‌లైంది. ఈ చిత్రానికి ముందు నుంచి హైప్ ఓ రేంజ్ లో మొద‌లైంది.

'రాధేశ్యామ్‌' త‌రువాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన‌ ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా చేసిన హంగామా వేరు. పాన్ ఇండియా స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ హ‌ల్ చ‌ల్ చేసింది. బాహుబ‌లి 2' త‌రువాత జ‌క్క‌న్న నుంచి వస్తున్న సినిమా, అందులోనూ ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే ఈ మూవీపై అంచ‌నాలు అంబ‌రాన్నంటాయి. వ‌సూళ్లు కూడా అదే స్థాయిలో వ‌చ్చాయి. ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్ర‌భంజ‌నం సృష్టిన్న వేళే మోన్ స్టార్ లా 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'తో క‌న్న‌డ‌ స్టార్ య‌ష్ దూసుకొచ్చాడు.

తొలి పార్ట్ సంచ‌ల‌నం సృష్టించ‌డంతో చాప్ట‌ర్ 2 కోసం యావ‌త్ దేశం మొత్తం ఆసక్తిగా చూసింది. ఏప్రిల్ 14న విడుద‌లైన సినిమా అంచ‌నాల‌కు మించి వుండ‌టంతో ప్ర‌స్తుతం ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వ‌సూళ్ల ప‌రంగా ఈ మూవీ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ మిగ‌తా చిత్రాల‌కు వ‌ణుకుపుట్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న వ‌సూళ్లు.. ఈ మూవీపై ఏర్ప‌డిన యుఫోరియా ఇప్ప‌డు మెగాస్టార్ ని ఇబ్బంది పెడుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ త‌రువాత థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి ఏప్రిల్ 29న 'ఆచార్య‌' మూవీతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు.

విచిత్రం ఏంటంటే మెగాస్టార్ సినిమాకు వుండాల్సిన బ‌జ్ ఈ మూవీకి ఏ ద‌శ‌లోనూ క‌నిపించ‌డం లేదు. ఇదే ఇప్ప‌డు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 లాంటి లార్జ‌ర్ దెన్ లైఫ్ సినిమాల‌ని చూసిన ప్రేక్ష‌కుల‌ని 'ఆచార్య‌' ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోతోంద‌ని అభిమానులే స్వ‌యంగా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. అంతే కాకుండా ఇప్ప‌టికే వ‌రుస‌గా భారీ చిత్రాలు చూసేసిన ఫ్యామిలీస్‌, ఆడియ‌న్స్ ఇంత త్వ‌ర‌గా మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో ఈ మూవీపై స‌హ‌జంగానే బ‌జ్ క‌నిపించ‌డం లేద‌ని ప‌లువురు వాపోతున్నారు. కేజీఎఫ్ 2 వ‌ల్ల 'ఆచార్య‌'పై భారీ ఎఫెక్ట్ ప‌డింద‌ని, మ‌రి కొన్ని రోజులు బాక్సాఫీస్ వ‌ద్ద ఆ సినిమా యుఫోరియా కొన‌సాగుతూనే వుంటుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News