గాడ్ ఫాద‌ర్ లో మెగా రాజ‌కీయం సాధ్య‌మేనా?

Update: 2022-09-24 07:31 GMT
మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసి చాలా కాల‌మ‌వుతోంది. ప్ర‌జారాజ్యం పార్టీ విలీనం త‌ర్వాత‌..రాజ్య స‌భ స‌భ్యుడిగా కొన్నాళ్లు కొన‌సాగారు. ఆ త‌ర్వాత ఆ బాధ్య‌త‌లు వేర్వేరు పార్టీలు క‌ల్పిస్తామ‌న్న మెగాస్టార్ వాటికి దూరంగా ఉండాల‌నుకుంటున్నార‌ని చాలాసార్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అలాగే త‌మ్ముడు  ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ విష‌యంలోనూ  చిరు ఏ రోజు త‌ల‌దూర్చింది లేదు.

రాజ‌కీయంగా త‌మ్ముడు ఎద‌గాల‌నుకునేలా వ్యాఖ్య‌లు చేసారు త‌ప్ప‌..తాను ఏనాడు ఎంట్రీ  ఇస్తాన‌ని  చెప్పింది లేదు. కంబ్యాక్ త‌ర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. అదే ప్ర‌పంచంగా ముందుకెళ్తున్నారు. అయితే మెగాస్టార్ తాజా సినిమా 'గాడ్ ఫాద‌ర్' మాత్రం మ‌ళ్లీ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోన్న సంగ‌తి  తెలిసిందే.  'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు'  అంటూ చెప్పిన  డైలాగ్ ఎన్నో సందేహాల‌కు తావిస్తోంది.

ఇది సినిమా డైలాగ్ అయినా..చిరంజీవి మ‌న‌సులో మాట అదేనా? అత‌ని డైలాగ్ వెనుక ఊహించ‌ని క‌థ ఉందా? అని ఎన్నో క‌థ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇలాంటి డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయ‌ని అంత‌కంత‌కు వాతావ‌ర‌ణం వెడెక్కుతోంది. పైగా చిరంజీవి పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర పోషించ‌డంతో తాజా రాజ‌కీయాల‌పైనా గాడ్ ఫాద‌ర్ సెటైర్లు గుప్పిస్తారా? అన్న విశ్లేష‌ణ తెర‌పైకి వ‌స్తోంది.

తాజాగా సినిమాకి సెన్సార్ నుంచి యు ఏ స‌ర్టిఫికెట్ జారీ అయింది. దీంతో గాడ్ ఫాదర్ లో రాజ‌కీయ అంశాలు ఘాటెక్కిస్తాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఏపీలో అసంపూర్తిగా ఉన్న రాజధానుల నిర్మాణం.. ఆస్తులు పంచుకోవడం.. మళ్లీ అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తున్నారంటూ కొన్ని డైలాగులు బలంగానే వినిపిస్తాయ‌ని ప్ర‌చారం సాగుతోంది.

సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావాలని చూపిస్తున్న ఆస‌క్తిని  సైతం 'గాడ్ ఫాద‌ర్' లో ట‌చ్ చేస్తున్నార‌ని వినిపిస్తుంది. వాస్త‌వ ప్ర‌పంచంలో స‌మ‌కాలిన ప‌రిస్థితులు క‌థ‌లో జొప్పించిన‌ట్లు సంకేతాలందుతున్నాయి. ఇదే నిజ‌మైతే మెగాస్టార్ సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌కి దిగిన‌ట్లే. చిరంజీవి రాజ‌కీయ నేప‌థ్యం గల‌ సినిమాలు ఇంత వ‌ర‌కూ చేయ‌లేదు. కొన్ని సినిమాల్లో పాకిక్షంగా క‌నిపించ‌డం త‌ప్ప  పూర్తి  స్థాయిలో పొలిటిక‌ల్ నేప‌థ్యాన్ని ఎంపిక చేసుకోలేదు. తొలిసారి 'గాడ్ పాద‌ర్'  ద్వారా లీడ‌ర్ గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డానికి రెడీ అయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News