ఇంత జ‌రిగినా.. ఒక్క‌రూ ప‌వ‌న్‌కు బాస‌ట కాలేదే!

Update: 2021-09-26 13:33 GMT
ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు పేర్నినాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అనిల్‌కుమార్‌, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ వంటివారు కౌంట‌ర్లు ఇచ్చారు. ప‌వ‌న్ కోస‌మే ఈ విధానం తీసుకురాలేద‌ని.. స్ప‌ష్టం చేస్తూనే.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డ్డారు. స‌రే! ఇది రాజ‌కీయంగా వారు వ్యాఖ్యానించారు అనుకుందాం. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ ఆవేద‌న బాగానే ఉంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లో రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెడితే.. ప‌రోక్షంగా లేదా ప్ర‌త్య‌క్షంగా.. ఆయ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ విష‌యంలో ఏపీ స‌ర్కారు దూకుడును ప్ర‌శ్నించారు.

ప్రైవేటు పెట్టుబ‌డులు పెట్టి.. కోట్ల రూపాయ‌లు అప్పులు తెచ్చి.. నెల‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి తీస్తున్న సినిమాల విష‌యంలో ప్ర‌భుత్వ పెత్త‌నం ఏంట‌ని నిల‌దీశారు. సినిమా టికెట్ల‌పై వ‌చ్చే ఆదాయాన్ని చూపించి.. ఏపీ ప్ర‌బుత్వం మ‌రిన్ని అప్పులు చేసేందుకు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ క‌ష్టాన్ని పెట్టుబ‌డిగా పెడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌రి దీనిలో వాస్త‌వ‌, అవాస్త‌వాల‌ను ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధానంగా.. సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించినవే క‌దా..ఇండ‌స్ట్రీ బాగు కోస‌మే.. పెత్త‌నం చ‌లాయించ వ‌ద్ద‌ని.. సినిమా ప‌రిశ్ర‌మ‌ను త‌న మానాన‌త‌న‌ను వ‌దిలేయాల‌నే క‌దా! దీనిలో వాస్త‌వానికి ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త స్వార్థం అంటూ ఏమీ లేదు. ఆయ‌న నోరు విప్పి రాజకీయ విమ‌ర్శ‌లు చేశార‌నే వాద‌న ఒక్క‌టి ప‌క్క‌న పెడితే.. స‌బ్జెక్టు అయితే.. ఇండ‌స్ట్రీపై ప్రేమ‌తోనే ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు క‌దా!

మ‌రి.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఇంతలా హీటెక్కిస్తుంటే.. ఇండ‌స్ట్రీ నుంచి పెద్ద‌లు ఒక్క‌రంటే.. ఒక్క‌రు కూడా స్పందించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిన్న న‌టుడు నాని ఒక్క‌రు త‌ప్ప‌.. మ‌రెవ‌రూ.. పెద్ద‌గా స్పందించ‌లేదు. పైగా మంచు మోహ‌న్ బాబు.. ఇప్పుడు తానేమీ మాట్లాడేది లేద‌ని ఖ‌రాకండీగా చెప్పేశారు. మ‌రీముఖ్యంగా మెగా కుటుంబం నుంచి అటు చిరంజీవి కానీ..ఇటు నాగ‌బాబు కానీ.. స్పందించ లేదు. ఇక‌, బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ కానీ, దిల్ రాజు కానీ ఏమాత్రం పెద‌వి విప్ప‌లేదు. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌లుచేసే ద‌ర్శక‌ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. చిన్న నిర్మాత‌లు కూడా స్పందించ‌లేదు. అటు పెద్ద‌లు కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై నోరు విప్ప‌లేదు.

ఇదే ఇప్పుడు.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై మ‌రింత చ‌ర్చ‌ను తీసుకువ‌చ్చింది. ఇండ‌స్ట్రీపై ప్రేమ‌తో ప‌వ‌న్ ఇంత గొంతు చించుకున్నా.. ఏ ఒక్క‌రూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌క పోవ‌డం వెనుక ఏంజ‌రిగింది?  మౌనంగా ఉండ‌డం వెనుక ఎవ‌రి ఒత్తిడైనా ప‌నిచేస్తోందా?  లేక‌.. ప‌వ‌న్ ఏమ‌న్నా.. వీటిని రాజ‌కీయ‌కోణంలోనే చూస్తున్నారా?  ఇవ‌న్నీ కాకుండా.. త‌మ అభీష్టం మేర‌కే ఏపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నారా?  అనేది అంతుప‌ట్ట‌ని అంశాలుగా మారాయి. ఇక‌, ప‌వ‌న్ ఇప్పుడు ఈ మాట మాట్లాడాడు..రేపు మ‌రో మాట మాట్లాడ‌తాడు.. మ‌నం ఎందుకు అన‌వ‌స‌రంగా చిక్కుకోవ‌డం అని భావిస్తున్నారా?  వంటి ప్ర‌శ్న‌లు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఏదేమైనా.. ప‌వ‌న్ స‌ద‌రు వ్యాఖ్య‌లు చేసి 24 గంట‌లు గ‌డుస్తున్నా.. ఇండ‌స్ట్రీలోని పెద్ద త‌ల‌కాయ‌లు.. ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా మీడియా ముందుకు రాక‌పోవ‌డం ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ ఒంట‌ర‌య్యారా? అనే ప్ర‌ధాన ప్ర‌శ్న త‌లెత్తేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News