'ట‌క్ జ‌గ‌దీష్' రిలీజ్ విష‌యంలో ప్రైమ్ ఓటీటీ మొండిగా వ్యవహరిస్తోందా?

Update: 2021-08-22 00:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీలో ఇప్పుడు థియేటర్స్ మరియు ఓటీటీల మధ్య పోటీ ఏర్పడింది. పాండమిక్ టైంలో సినిమా హాళ్లు మూతబడి ఉండటంతో డిజిటల్ వేదికలు దీన్ని క్యాష్ చేసుకున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలచను ఫ్యాన్సీ ధరకు తీసుకొని ఓటీటీలో స్ట్రీమింగ్ పెడుతూ వచ్చారు. టాలీవుడ్ లో కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ విధానం ఊపందుకుంది. ఈ క్రమంలో కొన్ని క్రేజీ తెలుగు సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతుండటం ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ ను కలవరపెడుతోంది.

థియేటర్లు చాలా కాలం క్లోజ్ అవడంతో ఆర్థిక భారం భరించలేని నిర్మాతలు ఓటీటీ రిలీజులకు మొగ్గు చూపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. జనాలు వస్తారో లేదో అనే డౌట్ తో కొందరు ఓటీటీలు తమ సినిమాలను అమ్మేశారు. ఇప్పటికే 'నారప్ప' ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు 'టక్ జగదీష్' 'మాస్ట్రో' వంటి సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇది ఇలానే కొనసాగితే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని.. ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమాల ఓటీటీ విడుదలలను ఖండిస్తున్నారు.

ఇటీవల తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఓ మీటింగ్ పెట్టి అక్టోబర్ వరకు నిర్మాతలు అందరూ వేచి చూడాలని.. అప్పటికి పరిస్థితి కుదుటపడకపోతే ఓటీటీ రిలీజ్ కు వెళ్లొచ్చని తీర్మానించారు. అయినప్పటికీ 'టక్ జగదీష్' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కు అమ్మడం పట్ల ఎగ్జిబిటర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అది కూడా థియేట్రికల్ రిలీజ్ అవుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి పోటీగా అదే రోజున స్ట్రీమింగ్ పెట్టడాన్ని ఖండించారు. ఇది పెద్ద వివాదంగా మారే పరిస్థితి వచ్చింది.

దీనిపై శుక్రవారం ఎగ్జిబిటర్స్ అందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి పండుగ సమయాల్లో కొత్త సినిమాలని ఓటీటీలో విడుదల చేయడాన్ని నియంత్రించాలని నిర్మాతలను కోరారు. అదే సమయంలో 'టక్ జగదీశ్' ఓటీటీ విడుదల చేయడం గురించి మాట్లాడుతూ.. హీరో నాని కి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత ఆవేదనతో నిరాశతో మాట్లాడిన మాటలు అంటూ సారీ కూడా చెప్పారు. నిజానికి ఓటీటీలో నాని తన చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయించాలని గట్టిగా ప్రయత్నించాడు. కానీ నిర్మాతల మేలుకోరి చివరకు నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.

అయితే నిర్మాతలు ఒక సినిమాని డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో అమ్మేసిన‌ప్పుడు ఇక ఆ సినిమాకి సంబంధించిన విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించుకునే అవ‌కాశం ఓటీటీ సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు 'టక్ జగదీష్' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు కొన్నారు కాబట్టి స్ట్రీమింగ్ నిర్ణయం కూడా వాళ్లదే అవుతుంది. అమెజాన్ వారు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితుల్ని బ‌ట్టి త‌మ‌ ఓటీటీలో అప్ లోడ్ చేసే సినిమాల విడుద‌ల తేదీల పై నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఒక్క‌సారి నిర్ణ‌యం తీసుకుంటే ఆ డెసిష‌న్ నుంచి త‌ప్పుకున్న సంఘటనలు అమెజాన్ ప్రైమ్ విష‌యంలో చాలా అరుదు. త‌మ సినిమా విడుద‌ల విష‌యంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి అవ‌కాశం లేదనే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు 'ట‌క్ జ‌గ‌దీష్' ని కూడా సెప్టెంబర్ 10న 'లవ్ స్టోరీ' థియేట్రికల్ రిలీజ్ రోజున విడుదల చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ తన అఫీసియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెట్టింది.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'వి' చిత్రంలోని నాని ఫోటోని షేర్ చేస్తూ క్యాప్షన్ పెట్టమని నెటిజన్స్ ని కోరింది. దీంతో 'టక్ జగదీష్' స్ట్రీమింగ్ డేట్ రాబోతోందని అందరూ ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ఏదైనా సినిమా అప్డేట్ ఇచ్చే 12 గంటల ముందుగా అలాంటి ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. దీనిని బట్టి చూస్తే రేపు నాని సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ట్వీట్ 'లవ్ స్టోరీ' విడుదలయ్యే రోజున 'టక్ జగదీశ్' చిత్రాన్ని రిలీజ్ చేయడం కరెక్ట్ అనే విధంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో అమెజాన్ మొండిగా వ్యవహరరిస్తోందా లేదా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News