'ఆర్‌ఆర్‌ఆర్‌' లో ఆయనే ఇద్దరికి ఆచార్య

Update: 2020-04-13 08:00 GMT
రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలను మించి ఉండేలా జక్కన్న ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్‌ లు నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ పాత్ర ఏంటీ అనేది గత కొన్నాళ్లుగా చాలా మందికి ఆసక్తిగా ఉంది. ఎన్టీఆర్‌ కొమురం భీం.. చరణ్‌ అల్లూరి సీతారామరాజు అయితే అజయ్‌ దేవగన్‌ పోషించే పాత్ర ఏంటా అంటూ చాలా మంది ఇంట్రెస్టింగ్‌ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అజయ్‌ దేవగన్‌ పాత్రపై ఇంట్రెస్టింగ్‌ కథనం ఒకటి ప్రచారం జరుగుతోంది. కొమురం భీం.. అల్లూరి సీతారామరాజులకు స్వాతంత్య్ర కాంక్షను నేర్పడంతో పాటు వారికి యుద్ద విద్యలను నేర్పించే గురువు పాత్రలో అజయ్‌ దేవగన్‌ కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

రెండు విభిన్న ప్రాంతాలకు చెందిన వారైన అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం భీమ్‌ లు 1920 కాలంలో ఇంటి నుండి వెళ్లి పోయారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అయితే అలా వెళ్లి పోయిన వారు ఎక్కడకు వెళ్లారు అనేది ఎవరికి తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తెలియని విషయాన్ని జక్కన్న తనదైన క్రియేటివిటీ ఉపయోగించి వారిద్దరిని అజయ్‌ దేవగన్‌ పాత్రతో కల్పించబోతున్నాడని అంటున్నారు.

అడవుల్లోకి వెళ్లిన వారిద్దరిని కూడా విప్లవ వీరులుగా తీర్చి దిద్దిన ఆచార్యుడి పాత్రలో అజయ్‌ దేవగన్‌ కనిపించబోతున్నాడట. ఈ ఆచార్యుడి పాత్ర పూర్తిగా కల్పితం అని చరిత్రలో అలాంటి ఒక పాత్ర ఉన్నట్లుగా ఆధారాలు లేవని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News