దర్శకుడి చుట్టూ నెలకొన్న వివాదం సినిమాపై ప్రభావం చూపుతుందా..?

Update: 2022-07-27 10:30 GMT
టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన ఎస్ఎస్ ఆర్ శేఖర్.. ఇప్పుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కించిన "మాచర్ల నియోజకవర్గం'' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకుంటుండగా.. ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పేరుతో కొన్ని పోస్టుల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని సామాజిక వర్గాలను కించపరుస్తూ అసభ్యకరమైన పదాలతో ట్వీట్లు చేయడం.. ప్రస్తుతం అధికార పక్ష కులానికి మద్దతుగా కామెంట్స్ చేసినట్లు వాటిల్లో కనిపించింది. దీంతో అతను హార్డ్ కోర్ వైఎస్ జగన్ మద్దతుదారుడని.. టీడీపీ ద్వేషి అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే తన పేరుతో చక్కర్లు కొడుతున్న పోస్టులు ఫేక్ అని మ్ ఎవరూ నమ్మవద్దని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. అవన్నీ ఫేక్.. ఎవరో కావాలని ఎడిట్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని ఆరోపించారు. స్క్రీన్ షాట్ లో వున్న పేరు.. నా పేరుతో వున్న స్పెల్లింగ్ వేరు. ఫోటో షాప్ చేసిన వాడెవడో సరిగా చేయలేదు. నేను స్వతహాగా వైఎస్సార్ అభిమానిని. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నా అభిప్రాయాన్ని చెప్పానే తప్ప.. వేరే ఏ కులాన్ని కించపరచలేదు. ఆ సమయంలో నేను చేసిన ట్వీట్ ని ఒక్కటి కూడా డిలీట్ చేయలేదు. చేయను కూడా అని ఎస్ఆర్ శేఖర్ వివరణ ఇచ్చారు.

ఇదే పోస్ట్ పై హీరో నితిన్ స్పందిస్తూ ఈ విషయంలో దర్శకుడికి అండగా నిలిచారు. "ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన వివాదం సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది మిగతావారి మనోభావాలను దెబ్బతీసింది. ఇది చాలా విచారకరం. అంతేకాదు, ఈ పోస్ట్ అందరిని చాలా నిరాశపరిచింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను'' అని నితిన్ పేర్కొన్నారు.  ఆ ట్వీట్లు ఫేక్ అంటూ స్క్రీన్ షాట్స్ ని జత చేసారు.

ఇకపోతే దర్శకుడు పేరుతో ప్రచారంలో ఉన్న ట్వీట్లు నిజమా కాదా అని నిర్ధారించుకునేలోపే.. గతంలో ఎస్ఆర్ శేఖర్ ఏపీలో ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. 'విజన్ 2020 అంటే ఏంటో అనుకున్నా. జగన్ సీఎం అవుతాడు అని అప్పుడే గెస్ చేశాడా 40 ఇయర్స్' 'నేను కొడితే ఎలా ఉంటదో వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకూ(జగన్) తెల్వదు. ఇప్పుడు మీకు తెలుస్తది'.. ఇలా కొన్ని ట్వీట్లు రాజశేఖర్ రెడ్డి పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు ఓ వర్గం మద్దతుదారులు తీవ్రంగా కలత చెందుతున్నారు. అవి ఫేక్ ట్వీట్స్ అని దర్శకుడు వివరణ ఇస్తున్నా.. యూజర్ నేమ్ చేంజ్ చేసి ఉండొచ్చు కదా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులు ఫేక్ నా రియలా అనేది పక్కన పెడితే.. దర్శకుడి చుట్టూ నెలకొన్న వివాదం 'మాచర్ల నియోజకవర్గం' సినిమాపై ప్రభావం చూపుతుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గతేడాది 'చెక్' 'రంగ్ దే' 'మ్యాస్ట్రో' చిత్రాలతో ఆశించిన విజయాలను అందుకోలేకపోయిన నితిన్.. ఈసారి ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే మాస్ మసాలా ఎంటర్టైనర్ గా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా చేసాడు. హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా నితిన్ కు ఎలాంటి ఫలితాన్ని అందించిస్తుందో చూడాలి.
Tags:    

Similar News