'ఉప్పెన' వసూళ్లు చూసి ఉత్సాహపడితే కష్టమే!

Update: 2021-10-25 04:16 GMT
సినిమా తీయాలంటే డబ్బులు ఉండటం ఎంత ముఖ్యమో .. సినిమాను రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరకడం ఎంత ముఖ్యమో .. ఆ సినిమాను విడుదల చేసే సమయం అంతకంటే ముఖ్యం. కథాకథనాలు .. కాంబినేషన్లు .. కెమిస్ట్రీలు ఇవన్నీ థియేటర్లోకి అడుగుపెట్టిన తరువాత సంగతి. ఆ థియేటర్ల వరకూ జనం వచ్చే సమయమే కీలకం. కొన్ని సినిమాలు చూసినప్పుడు కథాకథనాలు .. పాటలు .. క్లైమాక్స్ అన్నీ కుదిరినట్టుగా కనిపిస్తాయి. ఇంతమంచి సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందబ్బా అని అనిపిస్తూ ఉంటుంది కూడా.

అలాంటి సినిమాలు థియేటర్ల దగ్గర దిగాలు పడటానికి కారణం, సరైన సమయంలో రిలీజ్ కాకపోవడమే. థియేటర్లకు జనం రాకపోతే వసూళ్లు వెలవెల బోతాయి .. నిర్మాతలు విలవిలలాడిపోతారు. అందుకే సినిమా నిర్మాణ రంగంలో బాగా అనుభవం ఉన్నవారు విడుదల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి గాని రంగంలోకి దిగరు. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకూ సినిమాలను వదిలే సాహసం చేయరు. ఎందుకంటే ఎగ్జామ్స్ టైమ్ లో కాలేజ్ పిల్లలు థియేటర్లకు దూరంగా ఉంటారు .. పిల్లల చదువు పై దృష్టి పెట్టే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రారు.

కానీ ఈ సారి పరీక్షల సమయంలోనే పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'ఆచార్య' సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా, చరణ్ - పూజ హెగ్డే మరో జోడీగా సందడి చేయనుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఫిబ్రవరి ముహూర్తాన్ని ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం. ఇక ఇదే బాటలో 'ఎఫ్ 3' కూడా అడుగుపెట్టడం మరింత విస్మయానికి గురిచేసే విషయం. ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మల్టీస్టారర్ క్రిందికే వస్తుంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా.. మెహ్రీన్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. అలాంటి ఈ రెండు సినిమాలు ఏ ధైర్యంతో వస్తున్నాయనే ప్రశ్నకి సమాధానంగా 'ఉప్పెన' పేరు వినిపిస్తోంది. ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాను ఉదాహరణగా తీసుకునే, ఈ సినిమాలు అడుగుముందుకు వేశాయని చెప్పుకుంటున్నారు. అయితే 'ఉప్పెన' సమయంలో ఉన్న పరిస్థితులు వేరు.

అప్పుడు కాలేజ్ లు .. స్కూళ్లు లేవు, పరీక్షలు పెడతారేమోననే కంగారు కనుచూపు మేరలో లేదు. అందువలన యూత్ అంతా కూడా తాపీగా ఉన్న సమయంలో 'ఉప్పెన' థియేటర్లకు వచ్చింది. అప్పటికే చాలా రోజులుగా థియేటర్లకు దూరంగా ఉన్న యూత్ కట్లు తెంచుకున్నట్టుగా థియేటర్ల వైపు పరుగులు తీసింది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. స్కూళ్లు .. కాలేజ్ లు తీశారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువలన 'ఉప్పెన'ను చూసి ఉత్సాహపడితే, అది పెద్ద సాహసమే అవుతుందనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News