శ్యామ్‌ సింగ రాయ్‌.. నడుమ నలిగి పోడుకదా!

Update: 2021-12-20 02:30 GMT
నాని హీరోగా నటించిన శ్యామ్‌ సింగ రాయ్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా నాని కొత్తగా ఈ సినిమా లో కనిపిస్తున్నాడు.. కొత్త తరహాలో మెప్పిస్తాడనిపిస్తుందని చర్చించుకుంటున్నారు. నాని రెగ్యులర్ కమర్షియల్‌ ఎంటర్‌ టైన్ మెంట్ సినిమాల తరహాలో కాకుండా ఈ సినిమా విభిన్నంగా సీరియస్ మూడ్ లో ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. శ్యామ్‌ సింగ రాయ్ పాత్ర పూర్తి గా సీరియస్ మూడ్‌ లో కనిపించబోతుంది. మరో నాని పాత్ర మాత్రం కాస్త ఎంటర్ టైన్ మెంట్‌ తో ఉంటుందనిపిస్తుంది. వరుసగా సంక్రాంతికి సినిమాలు రాబోతున్న నేపథ్యంలో శ్యామ్‌ సింగ రాయ్ కి ఎలాంటి ఆదరణ ఉంటుంది అనేది కాస్త అనుమానంగా ఉంది.

సాదారణంగా ప్రేక్షకుడు ఇప్పుడు ఉన్న టికెట్ల రేట్ల కారణంగా నెలలో రెండు లేదా మూడు సినిమాల కంటే ఎక్కువ చూడలేని పరిస్థితి. కొందరు అయితే ఒక్క సినిమా అన్నట్లుగానే టార్గెట్ పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో  సంక్రాంతికి ముందు ఆర్ ఆర్‌ ఆర్‌.. రాధే శ్యామ్‌.. బంగార్రాజు.. భీమ్లా నాయక్ వంటి సినిమాలు రాబోతున్న నేపథ్యంలో శ్యామ్‌ సింగ రాయ్‌ చూడాలని ఎంత మంది కోరుకుంటారు అనేది కొందరి ప్రశ్న. సినిమాకు పాజిటివ్‌ టాక్ వస్తే ఖచ్చితంగా చూసేవాళ్లు చాలా మందే ఉంటారు. సినిమా హిట్ టాక్ దక్కించుకుంటే లెక్కలు వేసుకుని సినిమాలు చూసే వారు కూడా శ్యామ్‌ సింగ రాయ్ ని చూసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక గత వారం విడుదల అయిన పుష్ప.. అంతకు ముందు విడుదల అయిన అఖండ సినిమాలు కూడా ఇంకా థియేటర్‌ ల్లో ఆడుతున్నాయి. ఆ సినిమాలు ఉండగా.. కొత్త సినిమాలు రాబోతుండగా శ్యామ్‌ సింగ రాయ్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి.

చిత్ర యూనిట్‌ సభ్యుల మాటలు చూస్తుంటే ఈ క్రిస్మస్ శ్యామ్‌ సింగ రాయ్ దే అన్నట్లుగా ఉంది. ఖచ్చితంగా వారు భారీ విజయాన్ని ఆశిస్తున్నారు. సినిమాపై వారికి ఉన్న నమ్మకం చూస్తుంటే నాని కెరీర్ లో బెస్ట్‌ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్యామ్‌ సింగ రాయ్ మూవీ తో నాని తనను తాను కొత్తగా ప్రజెంట్ చేయడంతో పాటు ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటున్నారు. ప్రీ  రిలీజ్ వేడుక లో దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ మాట్లాడుతూ 60 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను తీసినట్లుగా చెప్పేశాడు. నాని పై అంత బడ్జెట్‌ అంటే చాలా రిస్కీ విషయం. సినిమాపై అంత నమ్మకం.. కథపై వారికి నమ్మకం ఉండబట్టే ఆ స్థాయిలో ఖర్చు చేయించినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన సినిమాలు.. ముందు ముందు సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల నడుమ నలిగి పోకుండా కాస్త పాజిటివ్‌ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా శ్యామ్‌ సింగ రాయ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా కు సాయి పల్లవి మరియు ఉప్పెన హీరోయిన్‌ కృతి శెట్టిలు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తున్నారు. మడోనా సెబాస్టియన్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News