'శివ' రిలీజ్ రోజున వర్మ ఎక్కడున్నాడో నాకు తెలుసు: జేడీ చక్రవర్తి

Update: 2021-11-23 04:32 GMT
తెలుగు సినిమా ప్రపంచంలో 'శివ' ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆరిస్టుల బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. ఫైట్స్ .. సౌండ్ సిస్టమ్ .. కెమెరా పనితనంతో మార్పు ఇలా ప్రతి అంశానికి సంబంధించిన విషయంలో రామ్ గోపాల్ వర్మ కొత్తదనాన్ని చూపించారు. 1990 డిసెంబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, యూత్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. నాగార్జున .. అమల .. రఘువరన్ .. జేడీ చక్రవర్తి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, యూత్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా 'చక్రిభ్రమణం' కార్యక్రమంలో జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.

'శివ' రిలీజ్ రోజున మేమంతా హైదరాబాద్ లో ఉన్నాము .. టెన్షన్ లో ఉన్నాము. ఆ రోజున రాము (వర్మ) 'దేవి థియేటర్' దగ్గర ఉండాలి .. కానీ అక్కడ లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడన్నది నా ఒక్కడికే తెలుసు. ఆ రోజున ఆయన మద్రాసులో ఉన్నాడు. ఎందుకున్నాడంటే .. ఆయన గాళ్ ఫ్రెండ్ స్టేట్స్ వెళుతోంది. ఆ రోజు కూడా కాదు .. ఒక రెండు రోజుల తరువాత వెళుతుంది. ఈయన మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లిపోయి ఆ రోజు మధ్యాహ్నం వరకూ ఆ అమ్మాయితో గడిపేసి ఈవెనింగ్ ఫ్లైట్ కి వచ్చేశాడు. 'ఏంటి సార్ మీరు ..' అన్నాను నేను.

"ఏవయ్యా ఆ అమ్మాయితో ఉంటే అక్కడ నేను ఏమైనా చేయగలను. దేవి థియేటర్ కి వచ్చి నేను చేసేదేవుంది? చేయవలసినదంతా థియేటర్ కి రాకముందే చేశాను. ఆ క్షణంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది .. అదే చేశాను. ఇలాంటి అవకాశాలు ఎప్పుడైనా వస్తే వదులుకోకేం అని నాకు చెప్పాడు. అప్పుడే వర్మ అలా చేసినప్పుడు ఇక ఇప్పుడు నేను ఆయన గురించి ఏం చెప్పను? సోషల్ మీడియా వలన ఇప్పుడు ఆయన ఏమిటనేది మీకు తెలుస్తోంది. కానీ ఆయన అప్పుడు కూడా ఇలాగే ఉండేవాడు.

ఒకసారి నేను అమెరికా వెళ్లాను .. అక్కడ మా సిస్టర్ ఉంటుంది గనుక .. తరచూ వెళుతూ ఉండేవాడిని. అలా ఒకసారి వెళ్లినప్పుడు రాము నాకు కాల్ చేశాడు. తనకి గురుదక్షిణ కావాలని అడిగాడు. 'చెప్పండి సార్ .. ఏం కావాలి?' అని అడిగాను. పెన్ను - పేపర్ తీసుకోమని అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. 'ఎవరు సార్ వీళ్లంతా' అని అడిగాను. వాళ్లంతా బ్లూ ఫిలిమ్స్ లో టాప్ యాక్టర్స్ .. వాళ్ల వీడియోస్ కి సంబంధించిన ఎల్డీ లు కొనుక్కుని రమ్మన్నాడు. ఆ రోజుల్లో వాటితో పాటు పట్టుబడితే బయటికి రావడం చాలా కష్టం .. అందుకే వాటిని తీసుకుని రాలేదు. అప్పుడు కూడా ఆయన ఏమీ ఫీల్ కాలేదు .. చరిత్రలో గురుదక్షిణ ఇవ్వని శిష్యుడివి నువ్వేనయ్యా అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News