విజయ్ దేవరకొండ పై 'జబర్దస్త్' ట్రోల్స్..!

Update: 2022-09-13 09:30 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో యంగ్ సెన్సేషన్ గా మారిన వీడీ.. తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సౌత్ లోనే కాదు నార్త్ లోనూ విజయ్ ను ఇష్టపడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అతని స్పీచ్ ల కోసం ఎదురు చేసేవారున్నారు. అయితే అప్పుడప్పుడు VD యాటిట్యూడే ట్రోలింగ్ స్టఫ్ గా మారుతోంది.

'లైగర్' సినిమా విడుదలకు ముందు విజయ్ ఎంత హడావిడి చేసాడో తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా దేశం మొత్తం తిరుగుతూ.. తన స్పీచులతో అందరినీ ఆకర్షించాడు. అదే సమయంలో కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'మీకు మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు.. ఎవ్వడూ తెల్వదు. అయినా ట్రైలర్ కే ఈ రచ్చ ఏందిరా నాయనా' అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

ఆగస్ట్ 25న ఇండియా మొత్తం షేక్ అవుతుందని.. థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయి.. ఆగ్ లగా దేంగే అంటూ విజయ్ తనదైన శైలిలో స్టేట్మెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. వీడీ జడ్జిమెంట్ నే ప్రశ్నార్థకంగా మార్చింది. అంతేకాదు రౌడీ హీరో నెట్టింట ఎన్నడూ లేనంత నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.

'లైగర్' సినిమా హిట్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. ఇది ఫెయిల్యూర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. రిలీజ్ కు ముందు విజయ్ మాట్లాడిన మాటలకు.. కంటెంట్ కు ఏమాత్రం సంబంధం లేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

ఇలాంటి సినిమాలు తీస్తే.. అయ్య ఎవరో తెల్వదు.. తాత ఎవరో తెల్వడం కాదు.. ఇండస్ట్రీలో మనమెవరో తెలియకుండా పోయే పరిస్థితి వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. 'లైగర్' ప్లాప్ అవ్వడంతో కామెడీ షోలలో స్కిట్ లలోనూ విజయ్ దేవరకొండ పై సెటైర్లు ట్రోల్స్ చేస్తున్నారు.

'జబర్దస్త్' కామెడీ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో VD ని ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేసాడు బుల్లెట్ భాస్కర్. ఇందులో సూపర్ పాన్ ఇండియా స్టార్ గా ''ఏందిరా ఈ క్రేజ్.. మా అయ్యా ఆర్టిస్ట్ కాదు.. మా తాత ఆర్టిస్టు కాదు.. నేనూ ఆర్టిస్టు కాదు.. ఏందీ క్రేజ్'' అని టీమ్ లీడర్ భాస్కర్ డైలాగ్ చెప్పాడు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది విజయ్ దేవరకొండ పై సెటైరికల్ స్కిట్ అని కొందరు అంటుంటే.. ఇలా ఒక హీరోని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. హీరోల మేనరిజం మీద ఫన్నీ స్కిట్స్ చేసి కామెడీని పండించడం మనం చూస్తుంటాం. సినిమా హిట్టు అయితే దాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కాకపోతే ఇక్కడ 'లైగర్' ప్లాప్ అవ్వడంతో ట్రోలింగ్ చేసినట్లుగా భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News