అమెరికాలో రేవంత్ - జగదీశ్ రెడ్డి ఫైట్

Update: 2018-07-08 06:53 GMT
పొద్దున్నే టీవీ ఆన్ చేసి న్యూస్ చానళ్లు పెడితే రాజకీయ చర్చా కార్యక్రమాలు వాడివేడిగా సాగుతూ కనిపిస్తుంటాయి. వాదోపవాదాలు... చర్చోపచర్చలు.. సవాళ్లు ప్రతిసవాళ్లు.. ఒక్కోసారి తిట్లదండకాలు.. కొండొకచో చేయిచేసుకోవడాలు కూడా మన టీవీ చానళ్ల డిబేట్లలో కనిపిస్తుంటాయి. అయితే.. ఇప్పుడు తెలుగు నేలపైనే కాదు - విదేశాల్లో నిర్వహించే డిబేట్లలోనూ తెలుగు నేతలు బాహాబాహీకి దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీరి దెబ్బకు నిర్వాహకులు పోలీసులను పిలవాల్సి వచ్చిందట.
    
అమెరికాలోని పెన్సిల్వేనియాలో నిర్వహించిన నాటా పొలిటికల్‌ డిబేట్‌‌ లో తెలంగాణకు చెందిన మంత్రి జగదీశ్‌ రెడ్డి - కాంగ్రెస్‌ నేతలు మధు యాష్కీ - రేవంత్‌ రెడ్డి - బీజేపీ నేత కృష్ణ సాగర్‌ - మరికొందరు నేతలు ఈ డిబేట్‌ లో పాల్గొన్నారు. అయితే విపక్ష నేతలు టీఆర్ ఎస్‌ పాలనపై విమర్శలు చేసిన క్రమంలో వ్యవహారం కాస్త ముదిరింది. చర్చను కాస్తా రచ్చగా మార్చేశారు.  తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి - కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడమే కాకుండా ఒక దశలో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారింది.
    
చర్చాకార్యక్రమంలో ముందుగా మధు యాష్కీ మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్‌ వ్యవహారంపై మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరిట కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్ ఎస్‌ సర్కార్‌ వృధా చేస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం?.. మిషన్‌ కాకతీయ భవిష్యత్‌ లో మిషన్‌ కల్వకుంట్ల కాకూడదని కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌ దే. హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయబోమని సోనియా ఆనాడే స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించారు. కానీ, కేసీఆర్‌ ఆ క్రెడిట్‌ మొత్తం లాగేసుకున్నారు.’ అని విమర్శించారు. దీనికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు పస లేనివని.. గాంధీభవన్‌ నుంచి వచ్చే విమర్శలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేత కృష్ణ సాగర్‌ మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికి రావట్లేదు. ఆయన వర్క్ ఫ్రమ్‌ హోమ్ అయ్యారు. అది వర్క్ ఫర్ హోమ్ కూడా’ అని ఎద్దేవా చేశారు. ఈ దశలో  రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రేవంత్‌-జగదీశ్‌ లు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటంతో డిబేట్‌ వేడెక్కింది. వారిని శాంతిపజేసేందుకు సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో నిర్వాహకులు పోలీసులను పిలిపించాల్సివచ్చింది. అప్పటికి కానీ మన నేతలు దారిలోకి రాలేదట.
Tags:    

Similar News