గొంతు పోతే పోయిందనుకున్నా-జగపతి

Update: 2018-10-21 13:13 GMT
‘అరవింద సమేత’లో జగపతి బాబు పాత్ర.. ఆయన నటన చూసి జనాలు షాకైపోయారు. కెరీర్లో ఇప్పటికే మంచి పాత్రలు చాలానే చేశాడు జగపతి. నటుడిగా ఆయనేంటో చాలా సినిమాల్లో చూశాం. కానీ ‘అరవింద సమేత’లో బసిరెడ్డి పాత్ర మొత్తం కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఆయన నటన పతాక స్థాయికి చేరింది. బసిరెడ్డిగా జగపతి గెటప్.. ఆయన హావభావాలతో పాటు డైలాగ్ డెలివరీ కూడా జనాలకు షాకింగ్ గా అనిపించింది. రాయలసీమ యాసను పట్టుకున్న తీరుకు ఫిదా అయిపోయారు జనాలు. అందులోనూ గొంతు దగ్గర పెద్ద గాయం అయి.. ఆ నొప్పి సలుపుతుండగా ఓ మనిషి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు జగపతి. అన్నిటికంటే అది ఆశ్చర్యం కలిగించే విషయం. బసిరెడ్డి గాయం తాలూకు బాధను ప్రేక్షకులు ఫీల్ అయ్యేట్లు చేయగలిగాడు జగపతి.

ఐతే ఇందుకోసం డబ్బింగ్ సందర్భంగా జగపతి చాలానే కష్టపడ్డాడట. తన కెరీర్లో ఏ సినిమాకూ పట్టనంత ఎక్కువ సమయం ఈ చిత్రానికి పట్టిందని జగపతి చెప్పాడు. పాత్రకు తగ్గట్లుగా రఫ్ వాయిస్ వచ్చేలా చేసేందుకు.. అలాగే గొంతు దగ్గర గాయం ఉన్న ఫీలింగ్ తెప్పించేందుకు తాను చాలా కసరత్తులు చేశానని.. విపరీతమైన బాధను అనుభవించానని జగపతి చెప్పాడు. ఒక దశలో తన గొంతు పోతుందా అన్న భయం కూడా కలిగిందని.. అయినా తాను తగ్గలేదని అన్నాడు. గొంతు పోతే పోయిందిలే అన్న ఫీలింగ్ కూడా తనకు వచ్చిందని.. రాజీ పడకుండా ఆ పాత్రకు డబ్బింగ్ పర్ఫెక్టుగా వచ్చేలా చూసుకున్నానని.. త్రివిక్రమ్ మీద ఉన్న గౌరవం.. తారక్ మీద ఉన్న ప్రేమతో తాను ఈ సినిమాకు అంత కష్టపడ్డానని జగపతి చెప్పాడు. తన డబ్బింగ్ విషయంలో అంతగా ప్రశంసలు కురుస్తున్నాయంటే అందుకు రచయిత పెంచల్ దాస్.. శబ్దాలయ ఇంజనీర్ పప్పు.. అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్ లదే క్రెడిట్ అని జగపతి అన్నాడు.


Tags:    

Similar News