సీనియర్లు తల దించుకునే సినిమాలొస్తున్నాయ్

Update: 2017-01-02 17:30 GMT

 సీనియర్ నటులు.. నటీమణులకు ఇప్పుడు తెలుగు సినిమాల్లో అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. ఉన్న పాత్రలను కూడా పరాయి భాషలవారికి ఆఫర్ చేస్తూ.. మార్కెట్ పెంచుకునే వ్యూహం అంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే.. అలా వస్తున్న సినిమాలు కూడా తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నటి జమున.

తాజాగా తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్న ఆమె.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పులు జీర్ణించుకోగలిగేలా లేవని చెబుతున్నారు. 'ఇప్పటి తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పులు సమాజానికి ఏ మాత్రం మంచివి కావు. అప్పట్లో భక్తపోతన మూవీ చూసి బాలయోగి వస్తే.. ఇవాల్టి సినిమాలు చూసి రోడ్ సైడ్ రోమియోలు తయారవుతున్నారు. అనేక సన్నివేశాలు.. సినిమాలు.. పాత్రలు నాలాంటి సీనియర్ నటులు తలదించుకునేలా ఉంటున్నాయి.' అంటూ తన నిరుత్సాహం వెల్లడించారు.

 'అప్పట్లో మంచిని చెప్పే సినిమాలు వస్తే ఇప్పుడు చెడును చూపించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో యువతరం చెడు మార్గంలో నడుస్తోంది. సామూహిక అత్యాచారాల్లాంటి కూడా చోటు చేసుకోవడం వంటివి మంచి పరిణామం కాదు' అంటున్నారు జమున.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News