కొర‌టాల గ్యారేజీలో ఆర్జీవీ స‌ర్కారు!

Update: 2016-09-04 04:08 GMT
ఎన్టీఆర్ - మోహ‌న్ లాల్ కాంబినేష‌న్లోని జ‌న‌తా గ్యారేజ్ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. కొంత‌మందికి న‌చ్చింది - కొంత‌మందికి ఫ‌ర్వాలేదు అనిపించింది. అయితే, జ‌న‌తా గ్యారేజ్ లో స‌త్యం (మోహ‌న్ లాల్‌)పాత్ర చూస్తుంటే... రామ్ గోపాల్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ర్కారు చిత్రంలోని సుభాష్ నాగ్రే (అమితాబ్‌) పాత్ర గుర్తొస్తోంద‌ని కొంత‌మంది అంటున్నారు. అదొక్క‌టే కాదు.. సర్కారు చిత్రంలోని క‌థ‌కూ జ‌న‌తా గ్యారేజ్ క‌థ‌కూ ఉన్న పోలిక‌ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.

స‌ర్కారు చిత్రంలో సుభాష్ నాగ్రే (అమితాబ్‌) మాదిరిగానే, జ‌న‌తా గ్యారేజ్లో స‌త్యం (మోహ‌న్ లాల్‌) పాత్రను ఎస్టాబ్లిష్ చేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు వ‌స్తే స‌ర్కారులో సుభాష్ ద‌గ్గ‌ర‌కి వెళ్తారు. ఇక్క‌డ స‌త్యం ద‌గ్గ‌ర‌కి వెళ్తారు. అక్క‌డ సుభాష్‌కి ఇద్ద‌రు కొడుకులు. ఇక్క‌డా స‌త్యానికి ఇద్ద‌రే.. అంటే, ఒక‌రు క‌న్న‌బిడ్డ‌ - మ‌రొక‌రు త‌మ్ముడి బిడ్డ (ఎన్టీఆర్‌). స‌ర్కారు పెద్ద కొడుకు... తండ్రి మాట‌కు విన‌డు - గౌర‌వించ‌డు. తండ్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా పెర‌గ‌డు. జ‌న‌తా గ్యారేజ్ లో సత్యం సొంత కొడుకు కూడా అంతే, నాన్న ఆశ‌యాల‌కు విరుద్ధంగా పెరుగుతాడు! స‌ర్కారులో... బాగా చ‌దువుకున్న రెండో కొడుకు శంక‌ర్ (అమితాబ్‌) తండ్రి బాట‌లోకి వ‌స్తాడు! గ్యారేజ్‌ లో కూడా బాగా చదువుకున్న ఎన్టీఆర్ గ్యారేజ్ బాధ్య‌త‌లు తీసుకుంటాడు.

స‌ర్కారులో శంక‌ర్ (అభిషేక్‌)కి ఇద్ద‌రు హీరోయిన్లు... ఒక‌రు మ‌ర‌దలు - మ‌రొక‌రు ప్రియురాలు! తండ్రి ఆశ‌యాల కోసం ప్రియురాలిని దూరం చేసుకుని... మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుంటాడు శంక‌ర్‌! జ‌న‌తాలో కూడా పెద‌నాన్న ఆశయాల కోసం మ‌ర‌ద‌లు (స‌మంత‌)ని దూరం చేసుకుని, ఇంకో అమ్మాయి (నిత్య మీన‌న్‌)కు ద‌గ్గ‌రౌతాడు తార‌క్‌! ఇక‌, క్లైమాక్స్ విష‌యానికొస్తే... స‌ర్కారులో పెద్ద కొడుకు (కేకే మీన‌న్‌)ను త‌మ్ముడు శంక‌ర్ చంపేయాల్సి వ‌స్తుంది. అలా చంపేందుకు తండ్రి స‌ర్కారు ఒప్పుకుంటాడు కూడా! జ‌నతాలో కూడా సొంత కొడుకును చంపేయ‌డానికి, త‌మ్ముడి కొడుకుని అనుమ‌తి ఇస్తాడు స‌త్యం! ఇలా రెండు సినిమాల మ‌ధ్య కొన్ని పోలిక‌లు ఉన్నాయ‌ని కొంత‌మంది విశ్లేషిస్తున్నారు. ఇది కాక‌తాళీయంగా జ‌రిగి ఉండొచ్చు. కానీ, కాస్త అటుఇటుగా స‌ర్కారుకు ద‌గ్గ‌ర పోలిక‌లు జ‌న‌తా గ్యారేజ్ లో క‌నిపిస్తున్నాయి..!
Tags:    

Similar News