అమ్మ అనారోగ్యంతో ‘కోట్ల’ వ్యాపారం

Update: 2016-10-23 10:43 GMT
‘అమ్మ’కు అనారోగ్యం ఏమిటి? కోట్లాది రూపాయిల వ్యాపారం ఏమిటి? సంబంధం లేని ఈ మాటలేందనినిపించొచ్చు. కానీ.. వివరాల్ని చూస్తే విషయం మొత్తం ఇట్టే అర్థమైపోతుంది. అనారోగ్యంతో అమ్మ చెన్నైఅపోలోలో చేరి ఇప్పటికి సరిగ్గా నెల మీద ఒక రోజు అదనంగా అయ్యింది. తీవ్ర జ్వరం.. డీహైడ్రేషన్ తో అమ్మను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. అమ్మ అనారోగ్యం తీవ్రమైన విషయమేన‌ని అర్థమైంది. రోజులు గడుస్తున్నా అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో స్పష్టంగా చెప్పని పరిస్థితి. నిన్నటికి నిన్న కేంద్రమంత్రి.. టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి చెన్నై అపోలోకి వెళ్లారు.

అమ్మకు వైద్యం చేస్తున్న అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్ర‌తాప్‌.సి.రెడ్డితో మాట్లాడారు. అమ్మ యోగక్షేమాల గురించి ఆరా తీశారు. ఆమెకు చేస్తున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చినట్లు చెప్పటం ద్వారా.. అమ్మను పరామర్శించిన జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా చేరినట్లైంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులు తమతో మాట్లాడిన దాని ప్రకారం.. అమ్మ అనారోగ్యం 95 శాతం రికవరీ అయినట్లుగా చెప్పారు. సుజనా మాటకు పెద్ద ప్రచారం లభించకున్నా.. ఆయన మాటల్ని జాగ్రత్తగా ఫాలో అయ్యే వారికి అర్థమయ్యేదేమిటంటే.. అమ్మ ఆరోగ్యం చాలా వరకూ నయమైందనే.

ఇదిలా ఉంటే.. మరోవైపు అమ్మ అనారోగ్యం తమిళనాడు రాష్ట్రంలో భారీ వ్యాపారానికి తెర తీసిందన్న మాట ఆసక్తితో పాటు.. ఆశ్చర్యానికి గురి చేయటం ఖాయం. అమ్మకు అనారోగ్యంగా ఉంటే కోట్ల రూపాయిల వ్యాపారాలు జరగటం ఏమిటి? అన్న సందేహం రాకమానదు. అదెలా అన్న ప్రశ్నకు అక్కడి వారు చెబుతున్న మాటలు నోట మాట రాకుండా చేస్తాయి.

అనారోగ్యంతో ఉన్న అమ్మ ఆసుపత్రిలో ఉన్న వేళ.. అసలు ఆమెను పట్టి పీడిస్తున్న వ్యాధి ఏమిటో తెలీని పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో తెలీని ప్రజానీకం.. కనిపించని దేవుడి మీద నమ్మకం పెట్టేసుకున్నారు. తాము విపరీతంగా అభిమానించే అమ్మ ఆరోగ్యాన్ని చల్లగా కాపాడాలంటూ గుళ్లకు పోటెత్తుతున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ పూజల్లో భాగంగా వందలాదిగా మట్టికుండల్లో పాలను నింపి.. గుళ్లల్లో అభిషేకాలు చేస్తున్నారు. దీంతో.. మట్టికుండల వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోయింది. గడిచిన నెలలో మట్టికుండల వ్యాపారం రూ.8 కోట్ల మేర జరిగినట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

పూజల్లో భాగంగా పాల బిందెల్లో భారీ ఊరేగింపులు నిర్వహించి.. దేవతామూర్తులకు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ పూజల్లో నాయకులు రంగ ప్రవేశం చేయటంతో భారీతనం ఉట్టిపడుతోంది. నాయకులు తమ స్థాయిని అనుసరించి.. 108..508.. 1008 పాలబిందెల్ని కొనుగోలు చేస్తూ.. ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ నమ్మకం పుణ్యమా అని మట్టి కుండల వ్యాపారం డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిపోవటంతో పాటు.. బిందెల్నితయారుచేసే పరిశ్రమ వర్గాలు రాత్రింబవళ్లూ నిద్రపోకుండా బిందెల తయారీలో నిమగ్నమైన పరిస్థితి. మరింత జరిగిన తర్వాత.. బిందెల వ్యాపారం కోట్లాది రూపాయిలతో జరగటంలో ఆశ్చర్యపోవాల్సిందేముందేమీ లేదు క‌దా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News