ఓటీటీలో ఇస్మార్ట్ బ్యూటీ తమిళ్ డెబ్యూ మూవీ...?

Update: 2020-09-29 03:45 GMT
కరోనా కారణంగా థియేటర్స్ రీ ఓపెన్ చేయకపోవడంతో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ లో కూడా పలు క్రేజీ మూవీస్ ఓటీటీ బాట పట్టాయి. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ ''భూమి'' కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోందని సమాచారం. 'జయం' రవి కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై సుజాత విజయ్‌ కుమార్ నిర్మించారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న అందాల గని నిధి అగర్వాల్ 'భూమి' మూవీతో కోలీవుడ్ లో అడుగుపెడుతోంది. రైతు సమస్యల నేపథ్యంలో వారి గొప్పదనం తెలియచేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన 'భూమి' ప్రసార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

లాక్ డౌన్ కి ముందే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'భూమి' ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఇచ్చే ఫ్యాన్సీ ఆఫర్ కి మేకర్స్ మొగ్గు చూపినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీని గురించి మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ దాదాపుగా డీల్ క్లోజ్ అయినట్లేనని వార్తలు వస్తున్నాయి. జయం రవి కెరీర్లో మైలురాయి సిల్వర్ జూబ్లీ చిత్రాన్ని దీపావళి కానుకగా స్ట్రీమింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ అవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా 'భూమి' అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు. జయం రవి - లక్ష్మణ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'భూమి' పై భారీ అంచనాలే ఉన్నాయి.
Tags:    

Similar News