ఏదో అనుకుంటే.. 'ప్రేమించుకుందాం రా' వచ్చింది

Update: 2022-05-10 05:49 GMT
ప్రేమించుకుందాం రా.. విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే కాదు, మొత్తంగా తెలుగు సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటనదగ్గ చిత్రమిది. 90వ దశకంలో ఈ చిత్రం యువతను ఒక ఊపు ఊపేసింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీని జయంత్ సి.పరాన్జీ ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు చూసినా రిలేట్ చేసుకునేలా ఉంటుందా సినిమా. అప్పట్లో సెన్సేషనల్ హిట్టయిన ఈ చిత్రం పట్టాలెక్కడం వెనుక అనేక మలుపులున్నాయి.

అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్‌లో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన జయంత్.. దర్శకుడిగా మారే క్రమంలో వెంకీతో అనుకున్న సినిమానే వేరట. అతను వెంకీతో మొదలు పెట్టిన సినిమా ఇది కానేకాదట. ముగ్గురు హీరోయిన్లలో గోల గోలగా సాగే ఒక కథను ఓకే చేసుకుని సినిమా మొదలుపెట్టినట్లు జయంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరి ఆ సినిమా ఏమైందో.. 'ప్రేమించుకుందాం రా' ఎలా తెరపైకి వచ్చిందో జయంత్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

''వెంకీ కోసం మేం ముందు అనుకున్న కథ వేరు. అందులో ముగ్గురు హీరోయిన్లుంటారు. చాలా కామెడీగా, గోల గోలగా సాగే సినిమా అది. లవ్ స్టోరీకి తోడు చిన్న క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ముగ్గురు హీరోయిన్లుగా సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్‌లను అనుకున్నాం. అందులో ఒక అమ్మాయి సీబీఐ ఆఫీసర్ అనే విషయం మధ్యలో రివీల్ అవుతుంది. ఈ సినిమా స్క్రిప్టు ఓకే చేసి సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో చిత్రీకరణ కూడా మొదలుపెట్టాం.

పది రోజుల దాకా షూటింగ్ జరిగింది. వెంకీ-మాలాశ్రీ, కొందరు కమెడియన్ల మీద సన్నివేశాలు చిత్రీకరించాం. ఐతే సెకండ్ షెడ్యూల్‌కు ముందు మళ్లీ స్క్రిప్టు మీద ఓసారి కూర్చుందామని చూశాం. అప్పుడు సినిమాలో ఫ్యామిలీ యాంగిల్ బలవంతంగా ఇరికించినట్లు అనిపించింది. ఈ కథలో ఏదో తేడా ఉందనిపించింది. దీంతో ఈ కథ వద్దని నేను, సురేష్ బాబు ఫిక్స్ అయి పక్కన పెట్టాం. వేరే కథ కోసం చూస్తూ మూడేళ్లు గడిచిపోయాయి.

అలాగని నేనేమీ ఖాళీగా లేను. యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు చేస్తున్నా. చివరికి వెంకీ హీరోగా దీన్ రాజ్ అందించిన కథతో వేరే దర్శకుడు సినిమా చేయాల్సి ఉండగా.. ఆ దర్శకుడు ఆ కథ నచ్చక వెళ్లిపోవడంతో సురేష్ పిలిచి నాకు స్టోరీ లైన్ చెప్పాడు. అప్పటికే వెంకీ కోసం 'అడవి మనిషి' పేరుతో ఓ కథ మీద కూర్చున్న నేను.. దాన్ని పక్కన పెట్టి ఈ కథ నచ్చి దీంతోనే సినిమా చేయాలని ఫిక్సయ్యాను.

ఐతే అందులో వెంకీ ఇద్దరు ప్రేమికుల్ని కలిపేలా దీన్ రాజ్ కథ రాశాడు. కానీ నేను ఆ ప్రేమకథను వెంకీకి షిఫ్ట్ చేశాను. తర్వాత నేను, పరుచూరి సోదరులు.. అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వీఎన్ ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేష్.. ఇలా అందరం కూర్చుని నాలుగైదు నెలల పాటు పని చేసి ఆ స్క్రిప్టును ఒక కొలిక్కి తెచ్చాం. అప్పుడే రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా జోడించాం. అలా 'ప్రేమించుకుందాం రా పట్టాలెక్కింది'' అని జయంత్ తెలిపాడు.
Tags:    

Similar News