దేవుడే దాసరిని చూడనివ్వకుండా చేశాడు

Update: 2017-06-11 07:06 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావుతో గొప్ప అనుబంధం ఉన్న అలనాటి హీరోయిన్లలో జయసుధ ఒకరు. దాసరితో ప్రేమాభిషేకం.. మేఘసందేశం లాంటి ఆల్ టైం క్లాసిక్స్ లో నటించింది జయసుధ. ఐతే దాసరి చనిపోయినపుడు ఆయన్ని చూసేందుకు జయసుధ రాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే దేవుడే తనను దాసరిని చివరిసారి చూడకుండా చేశాడని అంటోంది జయసుధ. ఇప్పటికే భర్త మరణంతో కుంగిపోయి ఉన్న తాను.. తనకు తండ్రి సమానుడైన దాసరి మరణాన్ని తట్టుకోలేననే ఆ సమయంలో దేవుడు తానిక్కడ లేకుండా చేశాడని ఆమె అన్నారు.

‘‘గత నెలాఖర్లో కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలకు ప్లాన్‌ చేసుకున్నాను. మే 29నే విదేశాలకు బయల్దేరాను. 30న దాసరిగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసేసరికే ఆలస్యం అయింది. చివరి చూపు కోసం వచ్చేద్దామంటే నేనిక్కడికి వచ్చే లోపే ఆయన అంత్యక్రియలు పూర్తవుతాయని తెలిసింది. చాలా బాధపడ్డాను. దాసరి గారు నా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటివారు. ఆయన నాకు తండ్రితో సమానం. నన్ను వ్యక్తిగత జీవితంలో చాలా విషయాల్లో గైడ్ చేశారు. నాకు.. నితిన్‌ గారికి పెళ్లి చేసింది ఆయనే. దాసరి గారి దగ్గరే మా ఆయన అసోసియేట్‌ డైరెక్టర్‌ గా పని చేసేవారు. అప్పుడే మేం ప్రేమలో పడ్డాం. మాకు అండగా దాసరి గారు నిలబడ్డారు. అప్పటి నుంచి మాకే సమస్య వచ్చినా ఆయన దగ్గరే చెప్పుకునేవాళ్లం. మా ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినప్పుడు దాసరి గారే కౌన్సెలింగ్ చేసేవారు. నితిన్‌ గారి మరణం నాకు పెద్ద షాక్‌. ఇంతలోనే దాసరి గారు చనిపోవడం మరో షాక్. బహుశా నేనిక్కడ ఉండి ఉంటే ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయి ఉండేదాన్ని. అందుకే ఆ దేవుడే నన్ను తీర్థయాత్రలకు పంపించాడేమో అనిపిస్తోంది’’ అని జయసుధ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News