మణిరత్నం ఒకే ఒక్కడంటున్న జయసుధ

Update: 2018-08-30 07:06 GMT
ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాయకుడు’ చిత్రాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ వంద చిత్రాల్లో ఒకటిగా పేర్కొంది. ‘నాయకుడు’ ఒక్కటేనా.. మరెన్నో క్లాసిక్స్ అందించారు మణిరత్నం. చాలా తక్కువ మాట్లాడే మణిరత్నం... పనితోనే తనేంటో చూపిస్తుంటారు. మణిరత్నంతో పని చేసిన ప్రతి ఒక్కరూ ఆయన గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఆ జాబితాలో సీనియర్ నటి జయసుధ కూడా చేరారు. మణిరత్నంతో తొలిసారిగా దాదాపు రెండు దశాబ్దాల కిందట ‘సఖి’ సినిమా చేశారమె. అందులో హీరోయిన్ తల్లిగా నటించిన జయసుధ.. ఇంత కాలం తర్వాత మళ్లీ మణి సినిమాలో నటించారు.

మణిరత్నం కొత్త సినిమా ‘నవాబ్’లో ఆమె హీరోల తల్లిగా కీలక పాత్ర చేస్తోంది. ప్రకాష్ రాజ్‌ కు జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా మణిరత్నంపై సహజ నటి ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఎందరో దర్శకులతో పని చేశానని.. కానీ మణిరత్నం లాంటి దర్శకుడు ఒకే ఒక్కడు ఉంటాడని ఆమె అన్నారు. ‘‘మణిరత్నంతో ఇన్నేళ్ల తర్వాత పని చేస్తున్నా. కానీ ఇప్పటికీ సినిమా తీసే విషయంలో ఆయన దృక్పథం.. ఆలోచన విధానం అదే విధంగా ఉంది. అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఆయన స్థాయిని వేరే దర్శకులు అందుకోలేరు. సినిమా పట్ల ఆయన ప్రేమ చూస్తుంటే.. ఒక కొత్త ఫిలిం మేకర్‌ తో పని చేస్తున్న భావన కలుగుతుంది. ఆయన నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది’’ అని జయసుధ అన్నారు. మణిరత్నం సతీమణి సుహాసిని జయసుధకు చాలా మంచి స్నేహితురాలన్న సంగతి తెలిసిందే. ఆమె సూచన మేరకే మణి సినిమాల్లో జయసుధకు అవకాశాలు దక్కాయని అంటారు
Tags:    

Similar News