ఒకప్పుడు సినిమాల్లో హీరోలు వేసే పోలీస్ పాత్రలు ఉదాత్తమైనవిగా ఉండేవి. నీతికి, నిజాయితీకి మారుపేరులా ఉండే ఆ పాత్రల్నే హీరోలు పోషించేవారు. కానీ గత దశాబ్ద కాలంలో పోలీస్ పాత్రల తీరుతెన్నులు మారిపోయాయి. మంచి పోలీసు పాత్రలు జనాలకు బోర్ కొట్టేశాయి. కొంచెం తేడాగా ఉండే పోలీసు పాత్రలకే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. లక్ష్మీనరసింహ, శివమణి సినిమాల దగ్గర్నుంచి.. ఈ మధ్యే వచ్చిన పటాస్, టెంపర్ వరకు పోలీసు పాత్రలన్నీ తేడానే. ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది తమిళ దర్శకులే. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ నుంచి మరో తేడా పోలీస్ వస్తున్నాడు. అతనే.. జయసూర్య. విశాల్ పోషిస్తున్న పాత్ర ఇది. ఇంతకుముందు సెల్యూట్ సినిమాలో నిజాయితీకి మారు పేరైన పోలీస్ గా కనిపించిన విశాల్.. ఈసారి అవినీతి పోలీస్ గా కనిపించబోతున్నాడు.
నా పేరు శివ, పల్నాడు లాంటి సినిమాలు తీసిన సుశీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. తమిళంలో విశాలే నిర్మాత. కాజల్ కథానాయిక. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తొలిసారి నిర్మాత అవతారమెత్తి ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నాడు. మొన్నా మధ్య ఆడియో ఫంక్షన్ కూడా చేశారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో విశాల్ కరెప్టెడ్ పోలీస్ అన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యం ఉందని కూడా తెలుస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. విశాల్ తమిళంలో మంచి హిట్లు అందుకుంటున్నప్పటికీ ఆ సినిమాలు తెలుగులో సరిగా ఆడట్లేదు. ఈసారి మాత్రం కొట్టాలనే కసితో ఉన్నాడు. నాగేశ్వరరెడ్డి ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. సెప్టెంబరు 4న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కాబోతోంది.